అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
తొండూరు : మండలంలోని గోటూరు పంచాయతీ పరిధిలోని యాదవ కుంట గ్రామానికి చెందిన వల్లపు చెన్నారెడ్డి (47) మంగళవారం అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొండూరు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదవకుంట గ్రామానికి చెందిన వల్లపు చెన్నారెడ్డి గతంలో నారేపల్లెకు చెందిన కొంతమంది వ్యక్తుల వద్ద వ్యవసాయ పనుల కోసం అప్పు చేశాడు. మంగళవారం అప్పులు ఇచ్చినవారు ఇంటి వద్దకు వెళ్లి చెన్నారెడ్డి భార్యను, పిల్లలను అప్పు తీర్చలేదన్న ఉద్దేశ్యంతో నోటికొచ్చినట్లు దుర్భాషలాడారని, అవమానం భరించలేక విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. విషపు గుళికలు తిని ప్రాణాపాయస్థితిలో ఉన్న చెన్నారెడ్డిని108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపు చనిపోయినట్లు తెలిపారు. భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ రామంద్ర తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీదేవితోపాటు కుమారుడు గోవర్థన్, కుమార్తె గౌతమి ఉన్నారు.


