పెద్ద సార్‌ చెప్పారని..! | - | Sakshi
Sakshi News home page

పెద్ద సార్‌ చెప్పారని..!

Nov 26 2025 6:13 AM | Updated on Nov 26 2025 6:13 AM

పెద్ద సార్‌ చెప్పారని..!

పెద్ద సార్‌ చెప్పారని..!

ఎవరా వసంత్‌..

2021లో గొడవ జరిగితే

ఇప్పుడు కేసు నమోదు చేయడమేంటి

పోలీసులు వ్యాపారి ఇంటికెళ్లి

ఆస్తి పత్రాలు లాక్కోవడంపై

రాష్ట్ర ఉన్నతాధికారులు సీరియస్‌

తనికంటి సోదరుల కేసు విషయంలో పోలీసుల ఓవరాక్షన్‌

అప్రతిష్ట మూటగట్టుకున్న

ప్రొద్దుటూరు పోలీసులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : పై అధికారి చెప్పారని అత్యుత్సాహానికి పోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారుల కేసు ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. తనికంటి సోదరుల కేసు విషయంలో మితిమీరిన అత్యుత్సాహం, తమ పరిధులు దాటి వ్యవహరించిన ప్రొద్దుటూరు పోలీసులకు చివరకు భంగపాటు తప్పలేదు. ప్రొద్దుటూరులోని తనికంటి జ్యువెలర్స్‌ నిర్వాహకుడు శ్రీనివాసులు, వెంకటస్వామి కేసు వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వాణిజ్య కేంద్రంగా పేరు గాంచిన ప్రొద్దుటూరును పసడిపురి అని కూడా పిలుస్తారు. దేశంలోనే ముంబై తర్వాత ఇక్కడ అంతటి స్థాయిలో బంగారు విక్రయాలు జరుగుతాయి. ఎవరికై నా రూ.10 వేలు ఇస్తే ప్రామిసరి నోటు రాయించుకోవడం మనం నిత్యం చూసే వ్యవహారమే. అయితే ప్రొద్దుటూరులో మాత్రం కోట్ల విలువ చేసే బంగారం చేతులు మారినా చిన్న కాగితపు ముక్కపై వివరాలు నమోదు చేసుకొని సంతకం చేయించుకుంటారు. నమ్మకంతోనే ఇక్కడి గోల్డ్‌ మార్కెట్‌లో నిత్యం రూ.కోట్ల విలువైన కొన్ని కిలోల బంగారును విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే డబ్బు ఇవ్వడంలో తేడాలొచ్చి పోలీసుస్టేషన్‌లను ఆశ్రయించడం ప్రొద్దుటూరులో పరిపాటి అని చెప్పొచ్చు. తనికంటి జ్యూవెలర్స్‌ నిర్వాహకుల విషయంలో ఇలానే జరిగింది. తనికంటి శ్రీనివాసులు 2018లో హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌శర్మ వద్ద 10 కిలోల బంగారు తీసుకొని డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. 2021లో డబ్బు ఇస్తామని హేమంత్‌శర్మను ప్రొద్దుటూరుకు పిలిపించి శ్రీనివాసులు అతనిపై దాడి చేసి, కిడ్నాప్‌ చేశారనేది కేసు సారాంశం. ఈ ఘటనపై ఈ నెల 20న త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

భార్య కళ్ల ముందే శ్రీనివాసులను తీసుకెళ్లారు

ఈ నెల 21న తనికంటి శ్రీనివాసులు బంగారు షాప్‌ను మూసేసి రాత్రి 8.30 సమయంలో భార్యతో కలిసి స్కూటీలో ఇంటికి బయలుదేరాడు. శివాలయం సెంటర్‌లోకి వెళ్లగానే కొందరు వ్యక్తులు కారులో వచ్చి శ్రీనివాసులును తీసుకెళ్లారు. మీరెవరు ఎందుకు నా భర్తను తీసుకెళ్తున్నారని భార్య అడగ్గా త్రీ టౌన్‌ పోలీసులమని చెప్పారు. వెంటనే అతని భార్య శ్రీలక్ష్మి త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త గురించి అడిగితే తమకు తెలియదని చెప్పారు. ఇలా ఆమె రాత్రంతా పట్టణంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లు తిరిగింది. తన భర్త గురించిన సమాచారం ఎవరూ ఆమెకు చెప్పలేదు. ఒకానొక దశలో తెలంగాణా పోలీసులు అతన్ని తీసుకెళ్లారేమోనని భావించారు. తన భర్త కిడ్నాప్‌నకు గురయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎవరూ తీసుకోలేదు. మరుసటి రోజు కూడా ఆమె రోదిస్తూ స్టేషన్ల చుట్టూ తిరిగింది. శ్రీనివాసులుతోపాటు అతని తమ్ముడు వెంకటస్వామిని ఒక ఎస్టేట్‌లో ఉంచి రాత్రంతా పోలీసులు చితకబాదారు. చివరకు 22న సాయంత్రం 7.30 గంటల సమయంలో శ్రీనివాసులు, వెంకటస్వామిలు తమ వద్దనే ఉన్నారని పోలీసులు చెప్పడంతో శ్రీనివాసులుతోపాటు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే బంగారు వ్యాపారి కిడ్నాప్‌నకు గురయ్యాడనే వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీవీ చానళ్లు, సోషయల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ విషయం ముందు రోజే ఆమెకు చెప్పి ఉంటే శ్రీనివాసులును పోలీసులు తీసుకెళ్లిన వ్యవహారం సీరియస్‌ అయ్యేది కాదు.

పోలీసులు ఆస్తి పత్రాలను తీసుకెళ్లడం ఏంటి..

శ్రీనివాసులు, వెంకటస్వామిని బంధించి చితక బాదిన పోలీసులు 22న రాత్రి వదిలేశారు. అయితే శ్రీనివాసులు ఇంటికి వెళ్లగానే కొద్ది సేపటి తర్వాత సీఐలు తిమ్మారెడ్డి, వేణుగోపాల్‌, వసంత్‌ అనే మరో పోలీసు అధికారి అక్కడికి వెళ్లారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం హేమంత్‌శర్మ బాకీలోకి గాను ఆస్తి పత్రాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అతను ఇవ్వనని చెప్పినా ఆస్తి పత్రాలతోపాటు బంగారు దుకాణం తాళాలను బలవంతంగా తీసుకెళ్లారు. ఇదంతా వారి ఇంట్లో సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వ్యవహారమంతా పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో రావడంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా మళ్లీ 22న తనికంటి శ్రీనివాసులు, వెంకటస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23న సాయంత్రం కోర్టులో హాజరు పరిచారు. తనను పోలీసులు కిడ్నాప్‌ చేసి కారులో అనేక ప్రాంతాలకు తిప్పారని కోర్టుకు తెలిపాడు. రాత్రంతా నిర్భందించి నడవలేని స్థితిలో కొట్టారని చెప్పాడు. ఈ వ్యవహారంపై న్యాయమూర్తి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో తనికంటి సోదరులకు ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. చివరకు సొంత పూచీకత్తుపై వారిరువురికీ న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసులో పొందు పరిచిన సెక్షన్‌లకు సంబంధించి పోలీసులు సరైన ఆధారాలు చూపలేదని కోర్టు అభిప్రాయపడినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కోర్టు తీర్పు ఒక విధంగా పోలీసులకు చెంపపెట్టు అని చెప్పొచ్చు.

బలి పశువైన వన్‌టౌన్‌ సీఐ తిమ్మారెడ్డి

పెద్ద సార్‌ చెప్పడంతోనే తనికంటి కేసు విషయంలో ప్రొద్దుటూరు పోలీసు అధికారులు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఆయన మెప్పు కోసమో లేక మరేదైనా ఆశించి కేసులో దూకుడుగా వ్యవహరించారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. 2021లో ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. కాగా ఈ కేసులో వన్‌టౌన్‌ సీఐ తిమ్మారెడ్డిని బలి పశువును చేశారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఐ తిమ్మారెడ్డిని వీఆర్‌కు పంపిస్తున్నట్లు మంగళవారం కడప జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరికొంందరి పోలీసు అధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

కడప వీఆర్‌కు

సీఐ తిమ్మారెడ్డి

– విచారణ అధికారిగా

ప్రొద్దుటూరు డీఎస్పీ భావన

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ సీఐగా పని చేస్తున్న తిమ్మారెడ్డిని వీఆర్‌కు పంపినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పరిధిలో తీవ్రమైన ఆర్థిక నేరంపై వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. సంబంధిత స్టేషన్‌ సీఐ ఎం.తిమ్మారెడ్డి కేసును సరైన రీతిలో విచారణ చేయక పోవడం వల్ల విచారణ తీరుపై అనేక వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల తీవ్రత దృష్ట్యా, పోలీసుల విచారణ లోపాలపై లోతైన విచారణ చేపట్టడం జరుగుతోంది. సరైన విచారణ నియమాలు పాటించని వన్‌టౌన్‌ సీఐని వీఆర్‌కు పంపించినట్టు ఎస్పీ తెలిపారు. కేసు సమగ్ర దర్యాప్తునకు ప్రొద్దుటూరు డీఎస్‌పీ భావనకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ప్రొద్దుటూరు సీఐలతోపాటు వెళ్లిన వసంత్‌ అనే పోలీసు అధికారి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వసంత్‌ అనే పేరు ఎక్కడా వినలేదని ఇక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి వచ్చాడని కొందరు, తెలంగాణా రాష్ట్రానికి చెందిన అధికారి అని మరికొందరు చెబుతున్నారు. అసలు అతను పోలీసు శాఖకు చెందిన అధికారే కాదనే చర్చ కూడా జరుగుతోంది. అతని డైరెక్షన్‌లోనే ప్రొద్దుటూరు పోలీసులు వ్యాపారులను చితకబాదారని చెబుతున్నారు. వసంత్‌ వ్యవహారంపై జిల్లా పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పెద్ద సార్‌ పంపించడంతోనే అతను ప్రొద్దుటూరుకు వచ్చాడనేది పోలీసు వర్గాల సమాచారం. కాగా సివిల్‌ పంచాయతీలో పోలీసులు నేరుగా తలదూర్చడంపై తీవ్ర దుమారం రేగుతోంది. స్టేషన్‌కు వచ్చిన అన్ని కేసులను ఇలానే ట్రీట్‌ చేస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేజీల లెక్కన బంగారుకు సంబంధించిన అనేక చీటింగ్‌ కేసులు ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్లలో నమోదు అయ్యాయి. అయితే గతంలో ఏ పోలీసు అధికారి ఇలా వ్యవహరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement