
ఘన స్వాగతం
సాక్షి రాయచోటి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో అభిమానం ఉప్పొంగింది. ఆయన రాకతో అన్నమయ్య జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. రాజంపేట పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్‌లో పండుగ వాతావరణం కనిపించింది. ఎస్టేట్‌లోని ఆకేపాటి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు, అభిమానులు, ఆకేపాటి కుటుంబీకులు, బంధవులతో ఆ ప్రాంతం కళకళలాడింది. మాజీ సీఎం హెలీప్యాడ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి.. తిరుగు ప్రయాణం అయ్యే వరకు చుట్టూ ఎక్కడ చూసినా జగనిన్నాదాలతో హోరెత్తింది. మరోపక్క యువత, పార్టీ శ్రేణులు సీఎం.. సీఎం..అంటూ నినదించారు. ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది.
నూతన వధూవరులకు ఆశీర్వాదం
అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సోదరుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, సుజనల కుమారుడు ఆకేపాటి అనురాగ్‌రెడ్డి, వరదీక్షితరెడ్డిలను మంగళవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. ఆకేపాటి ఎస్టేట్ లోని స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సతీమణి అమరజ్యోతమ్మ, అనిల్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు.
జనమే జనం
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం 11.25 గంటల ప్రాంతంలో బాలిరెడ్డిపల్లె సమీపంలోని హెలీప్యాడ్‌లో దిగిన దగ్గరి నుంచి.. ఆకేపాటి ఎస్టేట్ వరకు ఎక్కడ చూసినా జనమే కనిపించారు. కడప–రేణిగుంట ప్రధాన రహదారిలోని ఆకేపాటి ఎస్టేట్‌కు వెళ్లే దారి అంతా కూడా వాహనాలతోనే కనిపించింది. హెలీప్యాడ్ చుట్టూ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు జెండాలు చేతబూని జగన్.. జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోపక్క సీఎం.. సీఎం.. అంటూ కూడా కేరింతలు కొట్టారు. హెలీప్యాడ్‌తోపాటు చుట్టూ మిద్దెల మీద నిలుచొని జగన్‌ను తిలకించారు. హెలీప్యాడ్ నుంచి ఆకేపాటి ఎస్టేట్ వరకు సుమారు కిలోమీటరుకు పైగా రోడ్డు వెంట ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఎస్టేట్‌లో అయితే జన నీరాజనం కనిపించింది. ఇసుకేస్తే రాలనంత జనంతో ఎటువైపు చూసినా పార్టీ శ్రేణులు, ఆకేపాటి బంధువులు, స్నేహితులతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. వైఎస్ జగన్‌పై పూలవర్షం కురిపిస్తుండగా.. ఆయన అలా ముందుకు కదిలారు.
వైఎస్ జగన్ రాకతో సందడే సందడి
అడుగడుగునా జన నీరాజనం
హెలీప్యాడ్ వద్ద కిక్కిరిసిన అభిమానులు
‘ఆకేపాటి’ వారి రిసెప్షన్‌కుహాజరైన జననేత
నూతన వధూవరులకు ఆశీర్వాదం
హోరెత్తిన జగన్నినాదాలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హెలీప్యాడ్‌లో వైఎస్సార్ సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డితోపాటు ఇతర నాయకులు సాదర స్వాగతం పలికారు. కొంతమంది నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి అధి నేతకు ఆహ్వానం పలికారు. అనంతరం హెలీప్యాడ్ నుంచి నేరుగా రిసెప్షన్‌కు మాజీ సీఎం పయనమయ్యారు. అడుగుడుగునా వైఎస్ జగన్‌కు జనాలు బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానంతరం వైఎస్ జగన్ బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన రాజంపేట పరిధిలో విజయవంతంగా ముగియడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.