
శాంతియుతంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ
కడప సెవెన్‌రోడ్స్: శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో వినాయక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్ లో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్‌తోపాటు ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా మన జిల్లా ప్రసిద్ధి చెందిందన్నారు. అన్ని మతాల ప్రజల సహకారంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గణేష్ ఉత్సవాలలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉత్సవాలు విజయవంతం చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టివిగ్రహాలనే పూజించాలన్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మాత్రమే సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ నిర్వాహకులను ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో గజ ఈతగాళ్లను, సిద్ధంగా ఉంచాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే దారిలో, సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జనం మార్గంలో కరెంట్ తీగలు, కేబుల్ వైర్లు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి.. ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వలన్నారు. అనవసరమైన విషయాలను అత్యుత్సాహంతో సోషల్ మీడియాలలో యువత పోస్ట్ చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజస్ స్థాయిలో కోఆర్డినేట్ మీటింగ్ నిర్వహించాలన్నారు. 108, మెడికల్ క్యాంపులను ఏర్పాటు వైద్యాధికారులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలో వసతులు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.మున్సిపల్ కమిషనర్ శానిటేషన్ పై పూర్తి దృష్టి సారించాలన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి భావంతో జరుపుకునేందుకు అంద రూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, శాంతిభద్రతలకు, మతసామరస్యానికి ఇబ్బంది కలగకుండా వినాయక ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రాంతాల, వీధుల వారీగా ఏర్పాటు చేస్తున్న ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు ముందస్తుగా సంబంధిత అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ ఆర్గనైజర్స్ పూర్తి వివరాలు ఆన్లైన్ యాప్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. కడపలో దాదాపు 250, ప్రొద్దుటూరులో దాదాపు 150 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణలో శాంతి భద్రతల ఏర్పాట్లపై పలువురు శాంతి కమిటీ సభ్యుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు జాన్ ఐర్విన్, చంద్రమోహన్, సాయి శ్రీ,కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి,పోలీసు అధికారులు, గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మునగా సతీష్, జనరల్ సెక్రటరీ కేవీ లక్ష్మినారాయన రెడ్డి, జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, శాంతి కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలనే పూజించాలి
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి