
అధికారులూ.. ఈ ఆక్రమణ కనిపించలేదా!
● మైదుకూరులో కేసీ కెనాల్ స్థలంలో వాటల్ ప్లాంట్ నిర్వహణ
● అధికార పార్టీ అండ ఉంటే అధికారులు పట్టించుకోరా
● వైఎస్సార్‌సీపీ నేతల డాబా అయితే
కూల్చేస్తారా..!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అధికార పార్టీ అండదండలుంటే ఎలాంటి తప్పు జరిగినా.. స్థలాలు ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం .. అదే ప్రత్యర్థి పార్టీ వర్గీయులైతే.. అధికార పార్టీ ఒత్తిడి ఉంటే బాధితుడికి నష్టం కలిగించే దుశ్చర్యకు ఏమాత్రం వెనుకాడకపోవడం అధికారులకు నిత్యకృత్యమైంది. మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ఇడమడక సమీపంలో వైఎస్సార్‌సీపీ నేత నగరి శ్రీకాంత్‌కు చెందిన డాబాను సోమవారం రెవెన్యూ, పోలీసు అధికారులు కూల్చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉన్నప్పటికీ లెక్క చేయని అధికారులు తెల్లవారుజామున 5 గంటలకు జేసీబీ పెట్టించి కూల్చి వేసి లక్షల్లో నష్టం కలిగించారు. అయితే మైదుకూరులో మాత్రం కేసీ కాలువ పక్కనే దానికి సంబంధించిన స్థలంలో ఏకంగా మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా లక్షలు సంపాదిస్తున్నా.. దీనిపైన ఫిర్యాదు అందినా ఆ వైపు సాగునీటి అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డులో సంతకు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఉండే కేసీ కెనాల్ అనుబంధమైన కొండపేట కాలువ స్థలంలో ఏడాది క్రితం మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర బంధువు సుబ్బారావు తనకు కావాల్సిన ఓ కుటుంబానికి కేసీ కెనాల్ స్థలంలో వాటర్ ప్లాంట్ పెట్టించాడు. దీని ద్వారా మినరల్ వాటర్ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. కేసీ కెనాల్ స్థలంలో కడప– కర్నూలు జాతీయ రహదారి పక్కనే 5 సెంట్ల వరకూ స్థలం ఆక్రమించి వాటర్ ప్లాంట్ నిర్మించుకుని దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. దీని వెనకాలే సొంత స్థలాల్లో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వారు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ వారికి దారి లేకుండా ఈ వాటర్ ప్లాంట్ అడ్డుగా నిర్మించారు. ఇది ప్రభుత్వ స్థలం కావడంతోనే విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. అధికార పార్టీ అండదండల వల్లనే ఈ వాటర్ ప్లాంట్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కేసీ కెనాల్ స్థలం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.