
భయానక వాతావరణం సృష్టిస్తున్న టీడీపీ నాయకులు
పులివెందుల టౌన్ : ఈనెల 12వతేదీన జరగనన్ను పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ నాయకులు భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి ఆరోపించారు. ఆదివారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో రాజకీయ క్రీడ జరగడంలేదని, జూదగాళ్ల క్రీడ జరుగుతోందన్నారు. తొడలు కొట్టి, మీసాలు మెలేసి ప్రజలను రెచ్చగొట్టి తగాదాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఇన్‌చార్జి మంత్రి సవితకు ప్రజలను రెచ్చగొట్టడం తప్ప వీరికి రాజకీయ విలువలు తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ కోసమే బీటెక్ రవి ఆయన భార్యను పోటీకి నిలబెట్టారన్నారు. పులివెందులలో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని, ఈ విషయం బీటెక్ రవికి, ఆదినారాయణరెడ్డికి బాగా తెలుసు అన్నారు. ఈనెల 12వ తేదీన జెడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో ఇంటింటికి తిరిగి వైఎస్సార్‌సీపీ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తామన్నారు. పులివెందులకు మెడికల్ కళాశాల అవసరమని ముఖ్యమంత్రిని అడిగే దమ్ములేని వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ఘాటుగా విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ప్రచారం చేస్తే అక్రమ కేసులు పెడతామని, రౌడీ షీట్ తెరుస్తామని ఇప్పటి నుంచే బెదిరింపు కాల్స్ మొదలయ్యాయన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్, వైఎస్సార్‌సీపీ వైద్య విభాగాం కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు.