
డీఆర్వో, ఆర్డీవో, కమిషనర్, జేసీ, కలెక్టర్‌పై చిర్రుబుర్రులు
సాక్షి ప్రతినిధి, కడప: స్వాతంత్య్రదిన వేడుకల్లో వేదికపై తనకు కుర్చీవేయలేదని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అధికారులపై చిందులేశారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన తనకు వేదికమీద చోటుకల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీపై గుడ్లురిమి కేకలేశారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కడపలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం స్వాతంత్య్రదిన వేడుకలు జరిగాయి. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ద్వారా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరించిన మంత్రి పరేడ్ పరిశీలన అనంతరం సందేశం చదివి విన్పించారు.
వేదికపైన మంత్రి ఫరూక్, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఆశీనులయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం స్టేజ్‌పైన ఎమ్మెల్యేకి అనుమతి లేదు. వీఐపీలకు వేదిక పక్కన సీట్లు కేటాయించారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి దంపతులు 10.34 గంటలకు వేడుకలకు వచ్చారు. అప్పటికే వేడుకలు ప్రారంభమై చాలా సమయం కావడంతో.. వీఐపీలకు కేటాయించిన కుర్చీల్లో కూడా కలెక్టర్, ఎస్పీ, జేసీ కుటుంబ సభ్యులు కూర్చున్నారు. వేదికపై కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహించారు.
ఎమ్మెల్యే దంపతులు స్టేజీ వద్ద నిలబడి ఉండటాన్ని గమనించిన డీఆర్వో విశ్వేశ్వరనాయుడు వారివద్దకెళ్లి కూర్చోవాలని ఆహ్వానించారు. దీంతో ఎమ్మెల్యే.. ప్రొటోకాల్ తెలియదా? అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత ఆర్డీవో జాన్ ఇర్విన్, కమిషనర్ మనోజ్‌రెడ్డి వెళ్లి ఆహ్వానించారు. వారిపైన కూడా ఎమ్మెల్యే చిర్రుబుర్రులాడారు. జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ వెళ్లి ఆహ్వానించారు. అంతే ఎమ్మెల్యే ఒక్కమారుగా.. పిల్లాటలాడుతున్నారంటూ గుడ్లురిమి చూశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే వినిపించుకోకపోవడంతో జేసీ వెనుదిరిగి వెళ్లారు.

ఆపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెళ్లి ఆహ్వానించగా.. థ్యాంక్స్ సార్ మీ మర్యాదకు.. అంటూ ఎమ్మెల్యే బదులిచ్చారు. 20 నిమిషాల అనంతరం ఎమ్మెల్యే దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. లేని ప్రొటోకాల్ కోసం ఆగ్రహించి ఎమ్మెల్యే మాధవీరెడ్డి మరోమారు వివాదాస్పదంగా నిలిచారు. ఎమ్మెల్యే ఒకవైపు సమయపాలన పాటించకపోగా.. మరోవైపు వేడుకలకు హాజరుకావడంలేదని ఆర్డీవో జాన్ ఇర్విన్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆలస్యంగా వచి్చన తర్వాత కూడా హుందాగా వ్యవహరించకుండా కుర్చీకోసం అధికారులపై చిందులు వేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.