
సాక్షి, ప్రొద్దుటూరు: జనరల్ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లతో చీటింగ్.. ఉప ఎన్నికలు వస్తే పోలీసులతో ప్రభుత్వమే రిగ్గింగ్ చేస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. నేడు చంద్రబాబు వంటి నల్లదొరల చీకటి పాలన మధ్య స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కనుమరుగు అయిందని మండిపడ్డారు. పోలీసుల లాఠీలు, తూటాలు, ఇనుప బూట్ల మధ్య పాలన జరుగుతోందన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నేడు ఈవీఎం మిషన్ల మధ్య ప్రజాస్వామ్యం నలిగిపోతోంది. ఉపిరి ఆడక ప్రజాస్వామ్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉప ఎన్నికలు వస్తే పోలీసులతో ప్రభుత్వమే రిగ్గింగ్ చేస్తే.. ప్రజలు ఎక్కడ ఓటేస్తున్నారు?. వారికి కావాల్సిన పాలకులను ఎక్కడ నిర్ణయించుకుంటున్నారు?. బ్రిటీష్ పాలకుల నుంచి మహాత్ముడు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను తీసుకువచ్చారు. నేడు చంద్రబాబు వంటి నల్లదొరల చీకటి పాలన మధ్య స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కనుమరుగైంది. అబద్దాలు, ఆశలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు.
నేడు పద్నాలుగు నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?. సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై అణచివేతకు తెగబడుతున్నారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. పోలీసుల లాఠీలు, తూటాలు, ఇనుప బూట్ల మధ్య పాలన జరుగుతోంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులపై బ్రిటీష్ వారు కూడా ఇంతలా బాధించలేదు. కానీ చంద్రబాబు పాలనలో బ్రిటీష్ వారిని మించి వేధింపులు ఉన్నాయి. ప్రశ్నించే ప్రతీ గొంతును పాశవికంగా కూటమి ప్రభుత్వం నొక్కేస్తోంది. ఇటువంటి నిరంకుశ పాలనలో స్వాతంత్ర్యం ఉందని స్వాతంత్య్ర దినోత్సవం ఎలా జరుపుకోవాలి? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు..
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అమలువుతుందా?. నాకు అసలు ఓటర్లు వద్దు.. దొంగ ఓటర్లే కావాలని చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకుంది. పులివెందులలో జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చుకుని దొంగ ఓట్లు వేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా ఒక్కొక్కరిపై 30 కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని, బెదిరించి ప్రభుత్వాన్ని నడిపే విధానం మంచిదా?. పులివెందులలో జరిగిన ఎన్నికను ఎన్నిక అంటారా? ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఆ ఎన్నిక చూసిన తర్వాత ప్రజాస్వామ్య వాదులంతా సిగ్గుతో తలదించుకుంటున్నారు. రాక్షసులు కూడా అంత హీనంగా ప్రవర్తించరు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు భక్షకులయ్యారు. రక్షణగా లేకపోగా.. ప్రజల మీదే పులివెందులలో దాడి చేశారు. నా ఓటు నేను వేసుకోవాలి నాకు రక్షణగా ఉండండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. ప్రజల పట్ల వాళ్లకు ఉండాల్సిన బాధ్యతను విస్మరించారు. తెలుగు దేశం పార్టీని గెలిపించడానికి పోలీసులు వంద సార్లు ప్రజాస్వామ్యాన్ని చంపారు.

ఈ దేశ ప్రజలకు ఎన్నికల కమిషన్‌పై గౌరవం పూర్తిగా పోయింది. ఎన్నికల కమిషన్‌కి ఎవరు అనుకూలం అయితే వారే పాలకులు అవుతారని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. ప్రజాస్వామ్యాన్ని కొద్దిగా కొద్దిగా బలహీనపరిచి.. కుప్పకూలేలా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చింది వైఎస్ జగన్. అటువంటి నాయకుడిని తిరిగి మనం మళ్లీ తెచ్చుకోవాలి.. అప్పుడే రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందగలుగుతారు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా కూలదోయాల్సిన అవసరం ఏర్పడింది’ అని అన్నారు.