
సాక్షి,వైఎస్సార్: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వీరంగం సృష్టించారు. తనకు కుర్చీ వేయలేదంటూ ఐఏఎస్ అధికారి అతిధి సింగ్‌పై చిందులు తొక్కారు.
కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. జాయింట్ కలెక్టర్ (జేసీ) అతిధి సింగ్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్‌పైకి ఎమ్మెల్యేలకు అనుమతి లేదు. అయినప్పటికీ తనకు కుర్చీ వేయలేదని, స్టేజ్‌పైకి ఆహ్వానించలేదని జేసీని గుడ్లు ఉరిమి చూశారు.
అయితే ఇదంతా గమనించిన కలెక్టర్.. ఎమ్మెల్యే మాధవిరెడ్డిని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని ఎమ్మెల్యే పట్టించుకోలేదు. దీంతో ఆమెను అక్కడే కూర్చోవాలని కోరారు. కూర్చునేందుకు ఒప్పుకోలేదు. తనకు కుర్చీ వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. అర గంటపైగా నిల్చొని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
