ప్రశాంతంగా ప్రారంభమైన డీఎస్సీ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్ష శుక్రవారం జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులంతా నిర్ణత సమయానికంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. వారిని అధికారులు కేంద్రం వెలుపలనే క్షుణంగా తనిఖీ చేశారు. ఒరిజినల్ హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను పరిశీలించన తర్వాతే లోపలికి అనుమతించారు. మొదటి రోజు కడప, ప్రొద్దుటూరు కేంద్రాలలో ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌కు సంబంధించి 1781 మంది అభ్యర్థులకు గాను 1584 మంది హాజరు కాగా 197 మంది గైర్హాజరైనట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఉదయం కడపలోని కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం, అన్నమాచార్య, స్విస్ట్‌లతోపాటు ప్రొద్దుటూరులోని సాయి రాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 936 మంది అభ్యర్థులకు గాను 862 మంది హాజరు కాగా 74 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం కడపలో అన్నమాచార్య, కేఓఆర్‌ఎం, కేఎల్‌ఎంతోపాటు ప్రొద్దుటూరులో సాయి రాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 845 మంది అభ్యర్థులకు గాను 722 మంది హాజరు కాగా 123 మంది గైర్హాజరయ్యారు. ఆయా కేంద్రాలకు కేటాయించిన డిప్యూటీ కలెక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. డీఈఓ షేక్ షంషుద్దీన్ కడపలోని కేఎస్‌ఆర్‌ఎంతోపాటు స్విస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలను తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని డీఈఓ తెలిపారు.
ప్రశాంతంగా ప్రారంభమైన డీఎస్సీ పరీక్ష


