ప్రజలను నమ్మించి మోసం చేసిన బాబు
పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ముంచుతున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు బాబు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టారని.. ఏకంగా అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకమైనా చిత్తశుద్ధితో అమలు చేశాడని గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. అదే వైఎస్సార్, వైఎస్ జగనన్న పేర్లు చెబితే అనేక పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. అలా కాకుండా ప్రజలను కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు తెచ్చుకునే నాయకుడిగా చంద్రబాబు నిలిచిపోతాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూడా ఆయన జగనన్న పథకాలకే పేర్లు మార్చి అవి కూడా అరకొరగా అమలు చేస్తున్నాడని మండిపడ్డా రు. కార్పొరేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేకుండా తయారైందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలేక అల్లాడుతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ఆదుకునే పరిస్థితి లేకపోవడం దౌర్భాగ్య మన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
ఏ–1మోటార్స్‌ను ప్రారంభించిన ఎంపీ
సోమవారం కడప రోడ్డులో వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగూరు అనిల్ బాబా నూతనంగా ఏర్పాటు చేసిన ఏ–1మోటార్స్ షోరూంను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్పలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ షోరూంలో మొదటి వాహనాన్ని కొనుగోలు చేశారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


