రాయచోటి వద్దు... కడపే ముద్దు
కడప సెవెన్‌రోడ్స్ : ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండా వైఎస్సార్ కడపజిల్లాలోనే కొనసాగించాలని ఆ మండలాలకు చెందిన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రెండు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు సోమవారం ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ప్రధాన గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బి.రాజగోపాలయ్య, అరవిందకుమార్, జవహర్, మోహన్‌రెడ్డి, రామకృష్ణయ్య మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్‌టీ నెం. 1500ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో కలుపడం వల్ల తమ మండలాలకు చెందిన ప్రజల భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుందన్నారు. కడప తమకు కూతవేటు దూరంలో ఉందన్నారు. కొత్తగా ప్రకటించిన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని కడపజిల్లాలోనే కొనసాగించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చలమయ్య, జేఏసీ నాయకులు రామదాసు, యానాదయ్య, ఒంటిమిట్ట మాజీ సర్పంచ్ నరసయ్య, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సిద్దయ్య, టీడీపీ నాయకులు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట, సిద్దవటం
ప్రజల డిమాండ్
కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు


