క్షమాపణ కోరిన డీపీఓ రాజ్యలక్ష్మి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా సంస్కృతిని కించపరుస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వా వెంకటయ్య, జిల్లా రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రమణ్యం, పలువురు సర్పంచుల సమక్షంలో క్షమాపణ చెప్పారు. డీపీఓ వ్యాఖ్యలకు నిరసనగా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందజేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న రాజ్యలక్ష్మి స్పందిస్తూ తాను తొందరపాటు లో అలా మాట్లాడానని చెప్పారు. కడప బాంబుల గడ్డ అని, తనతో చాలామంది అన్నారని, కానీ ఇక్కడి ప్రజల మంచితనం వల్ల తాను 14 నెలలుగా పనిచేయగలుగుతున్నానన్నారు. జిల్లా ప్రజలు కల్మషం లేని వారని చెప్పాలనుకున్నానని, కానీ సమయం లేకపోవడం వల్ల మరో అంశంపై మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తన వ్యాఖ్యలు జిల్లా ప్రజలను బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానన్నారు.
డీపీఓ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేయాలి
అంతకుముందు జిల్లా సంస్కృతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జిల్లా పంచాయతీ అఽఽధికారి రాజ్యలక్ష్మిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. కడపజిల్లాలో పనిచేయడమంటే యుద్ధం చేయాల్సి వస్తుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని సర్పంచులు మండిపడ్డారు. జిల్లా సంస్కృతిపై విషం కక్కిన డీపీఓపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.


