చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లే లక్ష్యం
ప్రొద్దుటూరు కల్చరల్ : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తన లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రొద్దుటూరులో సోమవారం బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. బీసీలు అంతా ఏకమై బలమైన బీసీ ఉద్యమాలను నిర్మిస్తే బీసీల డిమాండ్లన్నీ సాధించుకోగలమన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, బీసీ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సోమా లక్ష్మీనరసయ్య, సహ అధ్యక్షుడు సందు శివనారాయణ, రాష్ట్ర సెక్రటరీ జనరల్ బీవీ రాజు, జిల్లా అధ్యక్షుడు జింకా జయప్రకాష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, జిల్లా యువజన అధ్యక్షుడు శివనారాయణ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గురుమూర్తి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణయాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సుభాన్‌బీ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డెయ్య, విజయకుమార్, గురప్ప, గోపాలకృష్ణ పాల్గొన్నారు.


