పులివెందుల : పులివెందుల పట్టణం కదిరి రోడ్డులోని ఎర్రగుడిపాలెం గ్రామ పొలంలోని 170/1, 170/2, 171/1 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బాధితుడు ఆర్.శ్రీనివాస్ కోరారు. శనివారం పులివెందుల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా ఆ సర్వే నెంబర్లకు సంబంధించిన ప్రభుత్వ భూమిని సుబ్బరామయ్య అనే వ్యక్తి సాగు చేసుకుంటుండేవాడన్నారు.
అతను మరణించిన తర్వాత అతని భార్య, కుమారుడు ప్రకాష్‌లు తనను ఆశ్రయించి ఈ భూమిని సాగు చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందని, వ్యవసాయం చేసుకుని వచ్చిన ఆదాయాన్ని ఇరువురం తీసుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. అయితే తనకు ఉద్యోగరీత్యా ఇబ్బందిగా ఉండటంతో 2018లో ఆర్టీసీ డ్రైవర్ షరీఫ్‌ను కాపాలాదారునిగా నియమించానన్నారు. ఆ స్థలంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారన్నారు. 2019 నుండి షరీఫ్ ఆలయం, స్థలం తనదే అని చెప్పుకుంటూ ఈ స్థలాన్ని ఆక్రమించుకుని మోసం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని రెవెన్యూ అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు.
టీటీడీ లీగల్ కౌన్సిల్ సభ్యునిగా జీఎస్ మూర్తి
కడప రూరల్ : తిరుమల తిరుపతి దేవస్థానం లీగల్ కౌన్సిల్ సభ్యునిగా జీఎస్ మూర్తిని నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. జీఎస్ మూర్తి జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదిగా, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు. ఈయన 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలువురు న్యాయవాదులు జీఎస్ మూర్తిని అభినందించారు.
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప–కృష్ణాపురం రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం చైన్నై – ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు కడప రైల్వే ఎస్‌ఐ సునీల్ కుమార్‌రెడ్డి తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440900811, 9440627658 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కోరారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావుతో పాటు 27 మందిని ఎన్‌కౌంటర్ పేరుతో కేంద్ర సాయుధ బలగాలతో హత్య చేయించారని దీనిపై వెంటనే న్యాయవిచారణ చేయాలని కోరుతూ శనివారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో వివిధ రాజకీయ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ పౌరులను, ఆదివాసీలను హత్య చేసి కార్పొరేట్ సంస్థలకు విలువైన అటవీ సంపద, ఖనిజ వనరులను ధారాదత్తం చేస్తున్నాయని మండిపడ్డారు. ’ఆపరేషన్ సింధూర్’ ను అమెరికా జోక్యంతో నిలిపివేసి పాకిస్తాన్‌తో చర్చలకు పూనుకుంటున్నారు గానీ, సొంత దేశంలో మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేపట్టకుండా మోదీ ద్వయం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, వెంకటశివ, పౌర హక్కుల సంఘం నాయకులు సి. వెంకటేశ్వర్లు, సురేష్ బాబు, రెడ్డయ్య, రవిశంకర్, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గుర్రాల గోపాల్, డాక్టర్ ఓబుల్ రెడ్డి , మల్లెల భాస్కర్ , విరసం వరలక్ష్మి, జన విజ్ఞాన వేదిక నాయకులు శివరాం , కార్మిక సంఘం నాయకుడు డబ్ల్యు రాము , రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ప్రసాద్, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకుడు సృజన శ్రీనివాసరెడ్డి, సీఐటీయూ నాయకులు సుంకర రవి, కామనూరు శ్రీనివాసరెడ్డి, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు మల్లికార్జున్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్, లోక్‌సత్తా నాయకులు కృష్ణ, ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకుడు ద్రాక్షం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోండి


