బంగారం దుకాణంలో చోరీ కేసు:ముగ్గురి అరెస్టు
ఖాజీపేట : ఖాజీపేటలో బంగారం దుకాణంలో జరిగిన చోరీ సంఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. శనివారం ఖాజీపేటలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ మోహన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు.
ఖాజీపేట టౌన్‌లోని వీఎస్ జ్యువెలరీ దుకాణంలో ఏప్రిల్ 12న అర్థరాత్రి సమయంలో దొంగలు చోరీ చేసి వెండి ఆభరణాలతో పాటు, బంగారం చోరీ చేశారు. ఈ కేసును ఖాజీపేట సీఐ మోహన్ ఛాలెంజ్‌గా తీసుకుని ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ కెమెరాల్లో జరిగిన చోరీ రికార్డులను పరిశీలించారు. అందులో ఒక బొలెరో సిటీ పికప్ వాహనం లో చోరీ చేసిన దొంగలు పరారైనట్లు నిర్ధారించారు. ఈ ఫుటేజ్‌లోని వాహనాన్ని గుర్తించారు. ఈ వాహనం ఆధారంగా దొంగలు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారినిగా తేల్చారు. ఆరుగురు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
ముగ్గురు అరెస్టు..
మరో ముగ్గురి కోసం గాలింపు
పోలీసులకు అందిన సమాచారం మేరకు చెన్నూరు మండలం ఇర్కాన్ సర్కిల్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని ఖాజీపేట సీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వీరిలో యర్రగొల్ల బసవరాజు, సంజీవ అలియాస్ కొవ్వూరు సంజీవప్ప, ఎల్లప్పగా గుర్తించారు. వీరితోపాటు శంకరప్ప, మారుతి, బసవమోడేకర్‌లు చోరీల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. ఖాజీపేటలోని వీఎస్ బంగారం దుకాణంతోపాటు చెన్నూరు, కమలాపురం పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో కూడా వీరు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బంగారం, వెండి రికవరీ..
చోరీకి పాల్పడిన వారి నుంచి బంగారం, వెండిని పోలీసులు రికవరీ చేశారు. అందులో 100 గ్రాముల కుంకుమ భరిణ, 232 గ్రాముల 15 వెండి దీపాలు, 500 గ్రాముల 3 వెండి ప్లేట్లు, 293 గ్రాముల వెండి మెట్టెలు, 400 గ్రాముల వెండి గజ్జలు, 3.860 గ్రాముల బంగారు కమ్మలు, 2.430 గ్రాముల బంగారు ఉంగరం, 4.820 గ్రాముల బంగారం కమ్మలు దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
సులభంగా డబ్బు సంపాదన కోసమే..
చోరీ కేసులోని ఆరుగురు నిందితులు చెడు వ్యసనాలకు బానిసలై, సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో చోరీలకు పాల్పడేవారు. ఒక బొలెరో సిటీ పికప్ వాహనం ద్వారా పందులను దొంగతనం చేసేవారు. అలాగే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చారు. మొదట చోరీ చేయాలన్న ప్రదేశంలో రాత్రి వేళల్లో రెక్కీ నిర్వహించి అనువైన ఇళ్లు, దుకాణాలను గుర్తించేవారు. తరువాత ఆ దుకాణాలు, ఇళ్లలో చోరీ చేసేవారు.
బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం
పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు
వివరాలు వెల్లడించిన మైదుకూరు డీఎస్పీ


