సెపక్ తక్రా పోటీలలో ప్రతిభ
కడప ఎడ్యుకేషన్ : కేంద్ర పాలిత ప్రాంతమైన డ్యూ లో మే 18 నుంచి జరుగుతున్న ఖేలో ఇండియా సెపక్ తక్రా పోటీలలో వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన పాపన నాగహారికరెడ్డి ప్రతిభను చాటింది. మహిళా సెపక్ తక్రా డబుల్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ బాలికలు ప్రత్యర్థులపై వరసగా విజయాలు సాధించి కాంస్య పతకాన్ని సాధించారని సెపక్ తక్రా రాష్ట్ర సంఘం కార్యదర్శి జి.శ్రీనివాసులు తెలిపారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
చాపాడు : మండలంలోని ద్వారకానగరం గ్రామానికి చెందిన చింతకుంట దస్తగిరి (33) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దస్తగిరి గత కొన్ని రోజులుగా అప్పుల బాధతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబీకులు కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని విజయ్‌కుమార్ సర్కిల్ సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్పృహ కోల్పోయి కింద పడిపోయిన అతను కొద్ది సేపటి తర్వాత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అతను సమీపంలోని దుకాణాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవనం గడిపేవాడని చెప్పారు. త్రీ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాల కోసం స్థానికులను విచారించినా వ్యక్తిగత వివరాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే త్రీ టౌన్ పోలీసులను సంప్రదించాలని సీఐ గోవిందరెడ్డి కోరారు.


