దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
వేంపల్లె : స్థానిక రాజీవ్ నగర్ కాలనీలో మంగళవారం రాత్రి జరిగిన దాడిలో కత్తి శ్రీనివాసులు (50)అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ రంగారావు తెలిపారు. వేంపల్లెలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న కత్తి శ్రీనివాసులుపై అదే కాలనీకి చెందిన వెంకటేష్, అంజి, రాయుడు, చిన్న అనే వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. దీంతో చికిత్స కోసం కడప రిమ్స్‌కు వెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం కత్తి శ్రీనివాసులు మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లెలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న కత్తి శ్రీనివాసులు అనే వ్యక్తికి పందులు ఉండడంతో వాటికి ఆహారం అందించేందుకు అదే కాలనీలో ఉన్న కొత్త అంగడి వద్ద డ్రమ్ము పెట్టుకొని అ డమ్ములో ప్రజలు వేసిన అన్నం తీసుకొని వెళ్లేవాడు. దీంతో కత్తి శ్రీనివాసులకు అదే కాలనీలో ఉన్న వెంకటేష్, అంజిలకు వేస్ట్ అన్నం కోసం డ్రమ్ము పెట్టే విషయంలో గత రెండు నెలల నుంచి విభేదాలు ఉన్నట్లు తెలిపారు. మంగళవారం మృతుడు కత్తి శ్రీనివాసులు తన కుమారుడు అంకన్నను అన్నం డ్రమ్మును తీసుకొని రావాలని చెప్పడంతో అన్నం డ్రమ్ము తీసుకొని వచ్చేందుకు వెళ్లగా డమ్ము తీసుకొని వచ్చే సమయంలో వెంకటేష్, అంజి, రాయుడు, చిన్న అనే వ్యక్తులు దాడి చేయడంతో ఇంటికి వచ్చి అంకన్న తన తండ్రి కత్తి శ్రీనివాసులుకు దాడి చేసిన విషయం చెప్పడంతో మృతుడు శ్రీనివాసులు ప్రశ్నించేందుకు వెళ్లాడు. దీంతో అక్కడ జరిగిన వాగ్వాదంలో కత్తి శ్రీనివాసులుపై వెంకటేష్, అంజి, రాయుడు, చిన్న అనే వ్యక్తులు దాడి చేసినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును కడప రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. మృతునికి భార్య మల్లేశ్వరి, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగారావు తెలిపారు.


