అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు
బి.కోడూరు : మండలంలోని మున్నెల్లి చెరువులో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే వారు ఇష్టానుసారం చెరువులోని మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలానికి కూతవేటు దూరంలో ఉన్న మున్నెల్లి చెరువు నుంచి గత ఆరు నెలలుగా గుత్తేదారులు ఇష్టానుసారంగా భారీ ప్రొక్లెయిన్‌లు టిప్పర్లతో మట్టిని తవ్వుతుండటంతో చెరువు సుమారు పది అడుగుల లోతులోకి వెళ్ళిపోయింది. ఆయకట్టు కంటే చెరువు లెవల్ పది అడుగుల లోతులో ఉండటంతో వర్షాకాలంలో వచ్చే వర్షపునీరు గోతుల్లోకి సరిపోతుంది తప్ప ఆయకట్టు చెరువులకు అందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆయకట్టు చెరువు కింద వర్షపునీరు కంటే ఎల్‌ఎస్‌పీ ప్రాజెక్టు నీటి మీదనే ఆధారపడి ఆయకట్టు రైతులు పంటలను సాగు చేస్తారు. పది అడుగుల లోతు గోతులు తవ్వడం కారణంగా ఎల్‌ఎస్‌పీ నుండి వచ్చే కొద్దిపాటి నీరు గోతులకే సరిపోతుంది తప్ప ఆయకట్టుకు నీరందడం కష్టమని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఆయకట్టు చెరువును పరిశీలించి ఎంతో విలువైన ఆయకట్టు చెరువును కాపాడాలని మున్నెల్లి, టమటంవారిపల్లె, తువ్వపల్లె గ్రామాల రైతులు కోరుతున్నారు.


