మందుల కోసం వచ్చాడు.. బంగారు చైన్ లాక్కెళ్లాడు
ప్రొద్దుటూరు క్రైం : వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయాడు. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని హోమస్‌పేటలో సుభాషిణి అనే 70 ఏళ్ల వృద్ధురాలు కొన్నేళ్లుగా ఆయుర్వేద మందులను తయారు చేసి విక్రయిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం మందులు తీసుకునేందుకు గుర్తు తెలియని భార్యాభర్తలు అక్కడికి వచ్చారు. భార్య బయట ఉండగా భర్త లోపలికి వెళ్లాడు. తన భార్యకు ఆరోగ్య సమస్య ఉందని మందులు ఇవ్వమని అడిగాడు. ఆమె మందులు ఇచ్చే క్రమంలో మెడలోని బంగారు చైన్‌ను లాక్కొని ఆమెను తోసేశాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. దొంగ అక్కడి నుంచి బయటికి పరుగెత్తి భార్యతో కలిసి ఆటోలో పారిపోయాడు. వెంటనే సుభాషిణి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి, ఎస్‌ఐ యోగీంద్రలు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రెండున్నర తులాల బంగారు చైన్ అపహరణకు గురైనట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన భార్యా భర్తల ఫొటోలను త్రీ టౌన్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. వీరిని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


