24న డీఈఈ సెట్‌ | Sakshi
Sakshi News home page

24న డీఈఈ సెట్‌

Published Tue, May 21 2024 3:50 AM

24న డీఈఈ సెట్‌

కడప ఎడ్యుకేషన్‌ : వైఎస్సార్‌జిల్లాలో మే 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు–2024(డీఈఈ సెట్‌) (కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష) పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. ఈ పరీక్షను కడపలోని కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్‌ కాలేజి ఆఫ్‌ ఇంజినీరింగ్‌, శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అభ్యర్థులు వారి హాల్‌టికెట్లు https://apdeecet.apcfss.inలో పొందొచ్చని తెలిపారు. హల్‌ టికెట్‌లో ఫొటో ప్రింట్‌ సరిగా లేకపోతే అభ్యర్థులు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డు(ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటర్‌ గుర్తింపుకార్డు) పరీక్ష కేంద్రానికి తెచ్చుకోవాలని డీఈఓ సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

వేంపల్లె : వేంపల్లెలోని ఉర్దూ జూనియర్‌ కళాశాలలో ఈ ఏడాది నుంచి ఉర్దూ, ఇంగ్లీషు మీడియంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్‌ రవి పేర్కొన్నారు.ఈ ఏడాది 10వ తరగతి పాసైన వారు ఉర్దూ, ఇంగ్లీషు మీడియంతో పాటు సెకండ్‌ లాంగ్వేజ్‌ ఉర్దూ, తెలుగు తీసుకోవచ్చని ఆయన తెలిపారు.ఇటీవల విడుదలైన ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో 90శాతం ఉత్తీర్ణం సాధించామని తెలిపారు.మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని కోరారు.

22 నుంచి కౌన్సెలింగ్‌

కడప రూరల్‌ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలకు ఈ నెల 22, 23వ తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ ఎల్‌ మాధవిలత తెలిపారు. 22న జిల్లా పరిధిలో ప్రవేశ పరీక్ష రాసిన బాలురకు గండి క్షేత్రం గురుకుల పాఠశాలలో, బాలికలకు 23వ తేదీన కడప చిన్నచౌక్‌ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. బీఆర్‌ఏజీ ఇంటర్‌ సెట్‌ 2024 లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తామన్నారు. బాలుర గురుకులంలో 284 ఖాళీలు, బాలికల గురుకులంలో 441 ఖాళీల భర్తీకి 1:3 నిష్పత్తిలో కౌన్సెలింగ్‌ ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్ధులు తమ వెంట మెరిట్‌ కార్డు, పరీక్ష హల్‌ టికెట్‌, ర్యాంక్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, 10వ తరగతి మార్క్స్‌ మెమో, స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డును తీసుకురావాలని పేర్కొన్నారు.

27 నుంచి ఫొటో, వీడియోగ్రఫీలో శిక్షణ

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కెనరా బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుంచి ఫోటో, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధి నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజులపాటు కొనసాగే ఈ శిక్షణకు అభ్యర్థులు 10–45 సంవత్సరాల మధ్య వయ స్సు కలిగి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల యువతకు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866 నంబర్లలో సంప్రదించాలన్నారు.

హుండీ ఆదాయం లెక్కింపు

వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులు హుండీల ద్వారా సమర్పించుకున్న కానుకలను దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. ఇందులో మొత్తం రూ 3 27,410 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్త మురళీ మోహన్‌ రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్‌పెక్టర్‌ జనార్దన్‌, ఆలయ అర్చకులు సుమంత్‌ దీక్షితులు, దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ సిబ్బంది, చెన్నూరు శ్రీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

స్కానింగ్‌ మిషన్‌ పరిశీలన

నందలూరు (రాజంపేట) : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సరఫరా చేసిన అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ మిషన్‌ను అన్నమయ్య జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి దేవశిరోమణి పరిశీలించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ మిషన్‌ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతినెల 9,10వ తేదీల్లో నిర్వహించే ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ కార్యక్రమంలో గర్భిణులకు స్కానింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. లింగ నిర్ధారణ చేయకూడదన్నారు. వైద్యాధికారి డాక్టర్‌ డి కార్తీక్‌ విశ్వనాథ్‌, సిహెచ్‌ఓ వెంకటనారాయణ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ ఉషారాణి, పీహెచ్‌ఎన్‌ శైలజ, సూపర్‌ వైజర్లు నాగమల్లయ్య, సునీల్‌, ఎంఎల్‌హెచ్‌పీ ఆరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement