గండికోటకు అంతర్జాతీయ హంగులు | - | Sakshi
Sakshi News home page

గండికోటకు అంతర్జాతీయ హంగులు

Sep 27 2023 1:32 AM | Updated on Sep 27 2023 1:51 PM

గండికోటలో పెన్నా ప్రవాహం - Sakshi

గండికోటలో పెన్నా ప్రవాహం

కడప కల్చరల్‌: పర్యాటక అభివృద్ధికి రాష్త్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లాలో అభివృద్ధి వేగం పుంజుకుంది. అంతర్జాతీయ పర్యాటక ప్రపంచంలో వైఎస్సార్‌ జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కేలా అడుగులు పడుతున్నాయి.

► విశాఖలో జరిగిన గ్లోబల్‌ టూరిజం సమ్మిట్‌ వేదికగా రాష్త్రంలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో గ్రాండ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరున్న గండికోటలో ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే గండికోటకు వచ్చే సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది. స్థానిక హరిత హోటల్‌లో బస చేయాలంటే రెండు నెలల ముందే రిజర్వు చేసుకోవాల్సి వస్తోంది. వారాంతపు సెలవుల్లో బెంగళూరు, ముంబయి తదితర రాష్ట్రాల నుంచి టెక్కీలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో హరిత హోటల్‌ గదులు చాలక ప్రైవేటు టెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రైవేటు టెంట్ల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడంతో ఆ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది.

బలమైన పునాది
వైఎస్‌ఆర్‌ జిల్లాలో ప్రభుత్వ చర్యలతో బోటింగ్‌ సౌకర్యాలు పలుచోట్ల అందుబాటులోకి వచ్చాయి. ఇడుపులపాయ, వేంపల్లి, పులివెందుల, రాయచోటి ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలున్నట్లు ఆ రంగ ప్రముఖులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గండికోట, పాలకొండలు, గండిక్షేత్రం, రాయచోటి ప్రాంతాలలో ట్రెక్కింగ్‌కు పుష్కలంగా అవకాశాలున్నట్టు ఆ రంగ ప్రముఖులు గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో సాహస క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లంకమల అడవుల్లో ఇటీవల పెద్ద గుహలను గుర్తించడంతో వాటిని బెలుం గుహల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

కొత్త శక్తులు
కడప నగరం నుంచి ఒంటిమిట్ట మీదుగా చైన్నె రోడ్డులో వరుసగా చిట్వేలి వరకు ప్రసిద్ధమైన దేవాలయాలున్నాయి. ఆ ప్రాంతాన్ని పర్యాటక సర్క్యూట్‌ గా అభివృద్ధి చేసే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఇటీవల కడప నగరంలోని పాత కలెక్టరేట్‌ను పునరుద్ధరిస్తోంది. ఇది పూర్తయితే ఆ భవనం టూరిజం ఆకర్షణగా నిలవగలదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం పర్యాటక సదస్సులు నిర్వహిస్తూ ఈ రంగం అభివృద్ధికి తనవంతు సహకారం అందజేస్తోంది. బద్వేల్‌ ప్రాంతంలో యువకుల బృందాలు టూరిజం కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో టూరిజంలో డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement