రసాయన వ్యర్థాల విడుదలను నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

రసాయన వ్యర్థాల విడుదలను నియంత్రించాలి

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

● మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వినతి

నల్లగొండ టౌన్‌: కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని పంట కాలువల్లోకి పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలను నియంత్రించాలని పర్యావరణ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నాగసేనారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం నల్లగొండకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆయన వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్‌, చౌటుప్పల్‌ పరిసర ప్రాంతాల నుంచి కూడా రసాయన వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి నల్లగొండ జిల్లాలోని పంట కాలువల్లో వదులుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 1న రాత్రివేళ హైదరాబాద్‌ నుంచి రెండు ట్యాంకర్ల ద్వారా రసాయన వ్యర్థాలు తెచ్చి పెద్దవూర మండలం చింతపల్లి గ్రామ సమీపంలోని 11, 12 కిలోమీటర్ల మధ్య ఎస్‌ఎల్‌బీసీ ఎలిమినేటి మాధవరెడ్డి వరద కాలువలో విడుదల చేసినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి జిల్లా యాదయ్య, రైతులు ఉన్నారు.

అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా స్వాధీనం

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌ పట్టణంలో పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో అక్రమంగా బాణాసంచా నిల్వ ఉంచిన దుకాణాన్ని రెవెన్యూ, ఫైర్‌, పోలీసు అధికారులు గురువారం తనిఖీ చేశారు. సుమారు రూ.20 వేల విలువైన బాణాసంచాను ఫైర్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

బైక్‌, స్కూటీ ఢీ..

ఇద్దరికి తీవ్ర గాయాలు

భూదాన్‌పోచంపల్లి: బైక్‌, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌కు చెందిన బండారు మల్లారెడ్డి స్కూటీపై పోచంపల్లి నుంచి పద్మానగర్‌ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో జగత్‌పల్లి గ్రామానికి చెందిన సప్పిడి శ్రీకాంత్‌రెడ్డి బైక్‌పై పద్మానగర్‌ నుంచి పోచంపల్లి వైపు వెళ్తూ యూటర్న్‌ తీసుకొంటున్న క్రమంలో బైక్‌, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురు కిందపడటంతో ఇద్దరి తలకు గాయాలయ్యాయి. బండారు మల్లారెడ్డి తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అతడు కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. శ్రీకాంత్‌రెడ్డిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.60 కోట్లు

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను కొండ దిగువన సత్యనారాయణస్వామి వ్రత మండపంలో గురువారం లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.2,60,59,278 నగదు వచ్చిందని ఈఓ భవానీశంకర్‌ పేర్కొన్నారు. మిశ్రమ బంగారం 65గ్రాములు, మిశ్రమ వెండి 2కిలోల 650 గ్రాములు వచ్చిందన్నారు. వివిధ దేశాలకు చెందిన కరెన్సీ సైతం వచ్చిందన్నారు. ఈ ఆదాయం 44 రోజులదని ఈఓ పేర్కొన్నారు.

వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

నకిరేకల్‌(కట్టంగూర్‌) : సాగర్‌ తిరుమలగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన జిల్లా స్థాయి అండర్‌–14 వాలీబాల్‌ పోటీల్లో కట్టంగూర్‌ మండలంలోని దుగినవెల్లి హైస్కూల్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి ఏనుగుల గోపాల కృష్ణ ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం వెంకటరమణ తెలిపారు. ఎంపికై న విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఐతగోని సైదులుగౌడ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement