చందంపేట: ఉమ్మడి చందంపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. అనుమతుల పేరుతో అక్రమార్కులు రేయింబవళ్లు ఇసుక దందాను కొనసాగిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. మండలంలోని మానావత్‌తండా సమీపంలోని తాటికోల్–పోలేపల్లి వాగు కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందా పలు మండలాలకు విస్తరిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మానావత్‌తండా సమీపంలోని తాటికోల్–పోలేపల్లి వాగులోని ఇసుకను జేసీబీలు, కూలీల సహాయంతో ట్రాక్టర్లలోకి ఎక్కిస్తూ దేవరకొండ, నేరెడుగొమ్ము, చందంపేట తదితర మండలాలకు అక్రమార్కులు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులు ఒకచోట ఉంటే, క్షేత్రస్థాయిలో మాత్రం వేరే ప్రాంతాల్లో ఇసుక దందా సాగిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, తెల్లవారుజామున ఈ అక్రమ రవాణా జోరుగా సాగుతుండటంతో అక్రమార్కులు అందినకాడికి దండుకుంటున్నారు. అనుమతుల పేరుతో సాగుతున్న ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తే
చర్యలు తప్పవు
మండలంలో ఇసుక అక్రమ దందా నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం అనుమతులు ఉంటేనే ఇసుక రవాణా చేయాలి. అనుమతుల ముసుగులో అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదు.
– సత్యనారాయణ, తహసీల్దార్, చందంపేట
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
మానావత్‌తండా వాగు కేంద్రంగా రేయింబవళ్లు రవాణా
పట్టించుకోని అధికార యంత్రాంగం


