ఎమ్మెల్యే వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

నకిరేకల్‌(కట్టంగూర్‌) : ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు కారులో ఉన్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు. కట్టంగూర్‌ మండలం అయిటిపాముల గ్రామ శివారులో చెర్వుఅన్నారం బస్టాప్‌ సమీపంలో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నాయనమ్మ మృతి చెందడంతో ఎమ్మెల్యే వేముల వీరేశం శాలిగౌరారంలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి, ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో జరిగే ఓ కార్యక్రమానికి బయల్దేరారు. మార్గమధ్యలో అయిటిపాముల గ్రామ శివారులోని చెర్వుఅన్నారం బస్టాప్‌ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ఎమ్మెల్యే కారు ముందు వెళ్తున్న కాన్వాయ్‌ వాహనం నిలిచిపోయింది. దీంతో ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ కూడా బ్రేక్‌ వేసి కారును నిలిపివేశాడు. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు అతివేగంగా వెళ్తున్న మరో కారు అదుపుతప్పి, ఆగి ఉన్న ఎమ్మెల్యే కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు ముందున్న కాన్వాయ్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా దెబ్బతింది. ఘటన జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎంపీటీసీ చింత వెంకటనర్సయ్య, ఫొటోగ్రాఫర్‌ శశి, గన్‌మెన్‌ పరశురామ్‌ ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని కట్టంగూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే వీరేశం అదే కారులో చిట్యాలకు పయనమయ్యారు.

తరచూ ప్రమాదాలు

అయిటిపాముల శివారులోని చెర్వుఅన్నారం బస్టాప్‌ సమీపంలో హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్టాప్‌ వద్ద అండర్‌పాస్‌ బ్రిడ్జి దిగువకు ఉండటంతో నకిరేకల్‌ వైపు వెళ్లే వాహనాలు, నకిరేకల్‌ నుంచి కట్టంగూర్‌ వైపు వచ్చే వాహనాలు వేగంగా డివైడర్‌ వద్దకు వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. డివైడర్‌ నుంచి కట్టంగూర్‌ వైపు వచ్చే దారిలో హైవేపై ఉన్న కల్వర్టు ఇరుకుగా ఉంది. రద్దీ సమయంలో వాహనాలు వేగం తగ్గించాల్సి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఈ కల్వర్టు వద్ద ఒకేసారి మూడు వాహనాలు వెళ్లేలా రోడ్డును విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.

హైవేపై ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన

మరో వాహనం

కట్టంగూర్‌ మండలం

అయిటిపాముల శివారులో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement