● తొలిరోజు గంధం ఊరేగింపు, ఖవ్వాలీ
● రేపు దీపారాధన
అర్వపల్లి: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అర్వపల్లి హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈమేరకు వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు శుక్రవారం అర్వపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి బాబా గంధం ఊరేగింపు కోలాహలంగా ప్రారంభమై దర్గాకు చేరుకోనుంది. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు, రాత్రికి ఖవ్వాలీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ముగింపు రోజైన శనివారం బాబా సన్నిధిలో దీపారాధన (చిరాగ్) మహోత్సవం జరగనుంది. ఉర్సు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాగారం సీఐ నాగేశ్వరరావు, అర్వపల్లి ఎస్‌ఐ మధు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకోవాలని వక్ఫ్‌బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ అమీర్ అహ్మద్, జిల్లా ఇన్‌స్పెక్టర్ దస్తగిరి కోరారు.


