‘మన ఊరు–మన పాట’లో ప్రథమ బహుమతి | - | Sakshi
Sakshi News home page

‘మన ఊరు–మన పాట’లో ప్రథమ బహుమతి

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

హుజూర్‌నగర్‌(గరిడేపల్లి) : హైదరాబాద్‌లో దూరదర్శిని సప్తగిరి ఛానల్‌ నిర్వహించిన ‘మన ఊరు–మన పాట’ సీజన్‌–2లో గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురం గ్రామానికి చెందిన కళాకారుడు కోట వీరస్వామి ప్రథమ బహుమతి సాధించారు. భవిష్యత్తులో కూడా కళారంగంలో మరిన్ని విజయాలు సాధిస్తూ తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని కోట వీరస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు మర్యాద సైదులు, జోగునూరి సుందర్‌రావు, వీరన్న, దాసరి శ్రీనివాస్‌, దారం మల్లేష్‌ యాదవ్‌, నందిపాటి సైదులు, అనంత రాములు, తురక వీరయ్య, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కోట వీరస్వామికి పలువురు కళాకారులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆన్‌లైన్‌ ఉచ్చులో చిక్కుకోకండి

భువనగిరిటౌన్‌ : సాంకేతిక పరిజ్ఞానం నేటి వేగవంతమైన జీవనశైలికి ఎంతటి వెసులుబాటు కల్పించిందో, అంతే స్థాయిలో తీవ్రమైన ముప్పునూ తెచ్చింది. కాస్త ఏమరుపాటుగా ఉన్నా, అత్యాశకు పోయినా కష్టపడి దాచుకున్న జీవితకాల సంపాదన నిమిషాల్లో ఆవిరవుతోంది. అమాయకులే లక్ష్యంగా సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాల వల విసురుతున్నారు. ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు డిజిటల్‌ లావాదేవీల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, పోలీస్‌ యంత్రాంగం స్పష్టం చేసింది. ‘మీ డబ్బు.. క్లిక్‌.. ఎంపిక’ పేరిట ప్రజలను అప్రమత్తం చేస్తూ పోస్టర్లను రూపొందించి అవగాహన కల్పిస్తున్నారు.

లాభాల ఆశ చూపి..

వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా స్టాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూపులను సృష్టిస్తూ కొందరు కేటుగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారు. స్వల్ప కాలంలోనే ఊహించని లాభాలు వస్తాయంటూ నకిలీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రారంభంలో స్క్రీన్‌పై భారీ లాభాలు వస్తున్నట్లు గ్రాఫిక్స్‌ ద్వారా భ్రమ కల్పిస్తూ లక్షలాది రూపాయలను జమ చేయిస్తున్నారు. ఆ తర్వాత ఖాతాదారులు తమ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించినప్పుడు సాంకేతిక సమస్యల పేరుతో నిలిపివేస్తున్నారు. నిధులు విడుదల కావాలంటే అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజులు, పన్నులు చెల్లించాలంటూ మరింత డబ్బు వసూలు చేసి చివరకు నిలువునా ముంచుతున్నారు. ఇలాంటి అపరిచిత ప్లాట్‌ఫామ్‌లను నమ్మి సమస్యలు కొనితెచ్చుకోవద్దని, పెట్టుబడులు పెట్టే ముందే వాటి గుర్తింపు, విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

డిస్కౌంట్‌ల వెనుక భారీ మోసం

మరోవైపు ఆన్‌లైన్‌ షాపింగ్‌ పేరిట సరికొత్త మోసాలు విస్తరిస్తున్నాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, బ్రాండెడ్‌ బూట్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 70 నుంచి 90 శాతం వరకు భారీ తగ్గింపులు ఉన్నాయంటూ ఆకర్షణీయమైన నకిలీ లింకులు పంపిస్తున్నారు. అసలు ధరతో పోల్చితే నమ్మశక్యం కాని రీతిలో తక్కువ ధరలు చూపుతూ కొనుగోలుదారుల నుంచి ముందస్తుగా డబ్బులు లాగేస్తున్నారు. విద్యుత్‌ బిల్లులు, కొరియర్‌ పార్సిళ్ల పేరుతో వచ్చే అనుమానాస్పద వెబ్‌సైట్‌ లింకుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్‌ ప్రకటనలు చూసి తొందరపడి కొనుగోళ్లు జరపకుండా, వెబ్‌సైట్ల అధికారికతను నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.

కాల్స్‌ వస్తే అప్రమత్తంగా ఉండాలి..

బ్యాంకింగ్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ ఫోన్‌ కాల్స్‌ చేసి వ్యక్తిగత సమాచారాన్ని కాజేసే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఖాతాదారుల మొబైల్‌కు వచ్చే ఓటీపీ, ఏటీఎం లేదా యూపీఐ పిన్‌, కార్డు వెనుక భాగంలో ఉండే సీవీవీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. ఏ బ్యాంక్‌ లేదా అధికారిక ఆర్థిక సంస్థ కూడా ఫోన్‌ కాల్స్‌ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని, రహస్య కోడ్‌లను అడగవని గుర్తుంచుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులు పంపే క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయడం, తెలియని లింకుల ద్వారా అనధికారిక యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయడం వంటివి చేయకూడదని సూచించారు.

కొత్త పద్ధతుల్లో సైబర్‌ నేరాలకు

పాల్పడుతున్న కేటుగాళ్లు

అధిక లాభాలు, భారీ డిస్కౌంట్‌ల పేరిట నకిలీ లింక్‌లు పంపుతూ మోసం

ఓటీపీ, పిన్‌ నంబర్లు ఎవరికీ చెప్పొద్దని అవగాహన కల్పిస్తున్న పోలీసులు

మోసపోతే తక్షణమే టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేయాలని సూచన

మొదటి గంటలోనే స్పందించాలి

ఒకవేళ మోసపోయినట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి గంటలోనే స్పందించాలని అధికారులు పిలుపునిచ్చారు. వెంటనే జాతీయ సైబర్‌ హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కు కాల్‌ చేయాలని లేదా అధికారిక పోర్టల్‌ www.cybercrime. gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే వాట్సాప్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిజిస్ట్రీ నంబర్‌ 8712672222 ద్వారా కూడా సమాచారం అందించవచ్చని పోలీసులు తెలిపారు. సైబర్‌ సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా పోలీసులతో భాగస్వాములు కావాలని పోలీస్‌ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement