నాగార్జునసాగర్ : నందికొండ (హిల్‌కాలనీ) నివా సితుల ఐదు దశాబ్దాల సొంతింటి కలపై నీలినీడలు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా ఇళ్లపై యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూస్తున్న స్థానికులకు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మెమో కొంత ఊరటనిచ్చినప్పటికీ, దరఖాస్తుదారులందరికీ అవకాశం లభించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ
నందికొండలో నివాస స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు హామీలిస్తూనే ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 58, 59 జీవోల ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా, మొదటి విడతలో కొంతమందికి రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే, రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న వారికి డిమాండ్ నోటీసులు జారీ కాకముందే ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
సీఎం హామీతో చిగురించిన ఆశలు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి నందికొండ నివాసితులందరికీ ఇళ్లపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి.
మెమో జారీ చేసినా..
ఎట్టకేలకు ప్రభుత్వం 48,030 నంబర్ మెమోను జారీ చేసి, జీవో 59 కింద 500 చదరపు గజాలలోపు నివాస స్థలాలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, రెండో విడతలో దరఖాస్తు చేసుకున్న 1,354 మందిలో 903 మందికి మాత్రమే డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు అవకాశం కల్పించారు. మిగిలిన 451 మంది పేర్లు జాబితాలో లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తమ దరఖాస్తులను ఏ ప్రాతిపదికన పక్కన పెట్టారనే దానిపై అధికారుల నుంచి స్పష్టత కోరుతున్నారు.
అర్హులందరికీ న్యాయం
చేయాలని డిమాండ్
ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం నందికొండలో దరఖాస్తు చేసుకున్న 1,354 మంది అర్హులందరికీ తక్షణమే డిమాండ్ నోటీసులు జారీ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఐదు దశాబ్దాల ఈ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపి, మిగిలిన 451 కుటుంబాలకు కూడా సంపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నందికొండ మున్సిపాలిటీలో ప్రభుత్వం జారీ చేసిన మెమోతో
903 మంది ఇళ్ల క్రమబద్ధీకరణ
జాబితాలో లేని మరో 451 మంది
దరఖాస్తుదారుల పేర్లు
సీఎం ఇచ్చిన హామీని
నెరవేర్చాలని వేడుకోలు


