చండూరు : బైక్ వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన చండూరు ఉడతలపల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం పొనుగోడు గ్రామానికి చెందిన బండమీది శ్రీనివాస్ కురంపల్లిలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి మెడిసిన్ కోసం చండూరుకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఉడతలపల్లి గ్రామ శివారులోకి రాగానే బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనివాస్ ఇంటికి రాకపోవడంతో రాత్రంతా కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించారు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.
స్కూల్ బస్సు ఢీకొని
మహిళ దుర్మరణం
కోదాడరూరల్ : స్కూల్ బస్సు ఢీకొని మహిళా మృతిచెందింది. ఈ ఘటన కోదాడ పట్టణంలో బుధవారం జరిగింది. అనంతగిరికి చెందిన గుడిచుట్టు ఉపేంద్రమ్మ(43) అనంతగిరి శివారులోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త చనిపోవడంతో కుమారుడు, కుమార్తెను చదివించుకుంటూ కోదాడలోని నయానగర్‌లో ఉంటూ ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తుంది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని సహోద్యోగి శిరీష ద్విచక్ర వాహనంపై కోదాడకు వస్తుండగా.. మార్గమధ్యలో బోడిగుట్ట వద్దకు రాగానే ప్రైవేట్ స్కూల్ బస్సు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అదుపుతప్పి కిందపడిపోయారు. వెనుక కూర్చున్న ఉపేంద్రమ్మ బస్సు టైరు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి అన్న గోళ్ల పున్నయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరదలి అంత్యక్రియలకు వచ్చి వదిన మృతి
నేరేడుచర్ల : అనారోగ్యంతో మృతిచెందిన మరదలిని చివరిసారిగా చూసేందుకు వచ్చిన వదిన కూడా అనుకోని పరిస్థితుల్లో మృతిచెందింది. ఈ ఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు.. నేరేడుచర్ల మున్సిపాలిటీలోని నర్సయ్యగూడెంకు చెందిన బుజునూరి రామచంద్రమ్మ (82) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతిచెందింది. రామచంద్రమ్మను చివరి చూపు చూసేందుకు ఆమె వదిన వంటెద్దు వెంకటమ్మ(87) నర్సయ్యగూడేనికి వచ్చింది. మరదలి భౌతికకాయన్ని చూసిన వెంకటమ్మ ఎదురుగా ఉన్న తన తమ్ముడు పెదకోటిరెడ్డి ఇంటికి వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటమ్మ భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కోవడంతో అస్వస్థతకు గురై మృతిచెందింది. గంటల వ్యవధిలోనే వదిన, మరదలు మృతిచెందడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


