నోటీసులు జారీ చేస్తున్నాం
భువనగిరి, భువనగిరి టౌన్ : భువనగిరి మున్సిపాలిటీలోని ఓపెన్ ప్లాట్లు దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ జాగాల్లో వర్షపు నీటితోపాటు మురుగు నిలిచిపోతుండడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోతున్నాయి. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరంతా ఖాళీ ప్రదేశాల్లోకే చేరుతోంది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండడంతో ఆయా ప్రాంతాలు తీవ్ర అపరిశుభ్రంగా తయారై దోమలు, పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఈ అపరిశుభ్ర వాతావరణం కారణంగా పట్టణంలో దోమల బెడద తీవ్రమైంది. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచుకోని యజమానులకు జరిమానాలు విధించాలని, వార్డుల వారీగా ఫాగింగ్, బ్లీచింగ్ పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
‘చెత్త’శుద్ధీ లేదు!
భువనగిరి మున్సిపాలిటీలో సకాలంలో చెత్తను సేకరించే వాహనాలు రాకపోవడంతో రోడ్ల పక్కన చెత్తను పడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మాత్రమే వాహనాలు వస్తుండడంతో ఇంట్లో పేరుకుపోయిన చెత్త నుంచి తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో గత్యంతరం లేక స్థానికులు ఆ చెత్తను వీధుల్లో లేదా రోడ్ల పక్కన పడేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డుల్లో మొత్తం 186 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరిలో 28 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మిగిలిన 158 మంది అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. చెత్త సేకరణ కోసం ప్రతి 5 లేదా 6 వార్డులను కలిపి ఒక జోన్‌గా విభజించి, మొత్తం 6 జోన్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 18 ట్రాక్టర్లు, 4 ఆటోల ద్వారా ఇంటింటా 22 మెట్రిక్ టన్నుల వరకు తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన చెత్తను తుక్కాపురం గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
ఫ వర్షపు నీరు, మురుగు చేరి
దుర్వాసనమయం
ఫ ఇళ్లమధ్య ప్లాట్లలో పెరిగిన పిచ్చి మొక్కలు
ఫ ఇబ్బందుల్లో పట్టణవాసులు
భువనగిరి పట్టణంలో ఖాళీ ప్లాట్లు ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నాం. వెంటనే ప్లాట్లను శుభ్రం చేసుకోవాలని ఆదేశించాం. నోటీసులు ఇచ్చిన తరువాత కూడా శుభ్రం చేసుకోకపోతే చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా విధిస్తాం.
– చంద్రప్రకాష్ రెడ్డి,
మున్సిపల్ కమిషనర్, భువనగిరి


