యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు తొలుత సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేపట్టి, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజలు జరిపించారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సంప్రదాయంగా సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం, సాయంత్రం ఆలయ తిరు మాఢ వీధుల్లో జోడు సేవలు జరిపించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు పవళింపు సేవను నిర్వహించి ద్వార బంధనం చేశారు.
ఖిలాపై ‘స్వచ్ఛతా హి సేవ’
భువనగిరి : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని భువనగిరి ఖిలాపై మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛతా హిసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖిలాపై ఉన్న చెత్త, ప్లాస్టిక్ బాటిళ్లను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, వైస్ చైర్‌పర్సన్ మంజుల, వార్డు సభ్యులు బంగారు స్వర్ణలత, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
పోచంపల్లిని సందర్శించిన ఫ్రాన్స్ దేశస్తులు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లిని ఆదివారం ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు సందర్శించారు. చేనేత వస్త్ర దుకాణాలు, టూరిజం పార్కును, మగ్గాలపై తయారవుతున్న ఇక్కత్ వస్త్రాలను పరిశీలించారు. ఇక్కత్ కళ, డిజైన్లు చూసి కార్మికుల నైపుణ్యాలను అభినందించారు. అనంతరం చేనేత, ఇక్కత్ డిజైన్ వస్త్రాలను కొనుగోలు చేశారు.
ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం
భువనగిరి: తైక్వాండో ద్వారా ఆత్మరక్షణ పొందవచ్చని తైక్వాండో జిల్లా అసోసియేషన్ వ్యవస్థాపకుడు గుర్రం కృష్ణ అన్నారు. భువనగిరి పట్టణంలోని జంఖానగూడెం చౌరస్తా వద్ద గల వరల్డ్ తైక్వాండో అకాడమీలో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం బెల్ట్ గ్రేడ్ టెస్ట్ నిర్వహించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బెల్ట్‌తో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ మల్లేశం, శివప్రసాద్, రాధ, అక్షర, భరత్ తదితరులు పాల్గొన్నారు.


