ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం
భువనగిరి : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్టు వేస్తూ పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడడం లేదు. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను ప్రైవేటు విద్యాసంస్థలు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతుల వారీగా ట్యూషన్ ఫీజుల వివరాలు, ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలతోపాటు ఫైర్, సౌండ్, శానిటరీ, ట్రాఫిక్ సర్టిఫికెట్లు కూడా పాఠశాలల నోటీస్ బోర్డులో పెట్టడంతోపాటు విద్యాశాఖ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్‌లో గతనెల 7వ తేదీ వరకు అప్‌లోడ్ చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు జిల్లాలో ఏ ఒక్క పాఠశాల కూడా నమోదు చేయలేదు.
అధిక ఫీజులు వసూలు చేస్తూ..
జిల్లా వ్యాప్తంగా 156 ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలలో సుమారు 46వేల మందికిపైగా విద్యార్థులున్నారు. ఫీజుల విషయంలో ప్రైవేటు పాఠశాలలు అధికంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ పిల్లలకే రూ.వేలల్లో వసూలు చేస్తుండగా పదో తరగతి విద్యార్థులకు వార్షిక ఫీజుల కింద రూ.60వేల నుంచి రూ.75 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో సీట్ల కోసం డోనేషన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫీజుల వివరాలను విద్యాశాఖ పోర్టల్‌లో నమోదైతే అవే ఫీజులను అమలు చేయాల్సి వస్తుందని, తమ అధికాదాయం బయట పడుతుందని, ఐటీ ఇబ్బందులు వస్తాయనే నెపంతో ప్రైవేటు విద్యాసంస్థల యాజమన్యాలు ఫీజుల వివరాలను పోర్టల్‌లో పొందుపర్చడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నోటీసులకు ఆదేశాలు
పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని 45 రోజులు గడుస్తున్నా పాఠశాలలు మాత్రం నమోదు చేయలేదు. అయితే వివరాలను నమోదు చేయని పాఠశాలలకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని ఈనెల 22న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ననీన్ నికోలస్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు వివరాలను పోర్టల్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
ప్రైవేటు పాఠశాలలు తప్పునిసరిగా ఫీజుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలి. దీనిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్, డీఈఓ, డీఎంహెచ్‌ఓలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనలు పాటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీచేస్తాం.
– భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారి
ఫ విద్యాశాఖ పోర్టల్‌లో నమోదు చేయని ప్రైవేటు విద్యాసంస్థలు
ఫ 45 రోజుల క్రితమే
ఆదేశించినా బేఖాతరు
ఫ నేటికీ ఏ ఒక్క పాఠశాల
అప్‌లోడ్ చేయలే..
ఫ నిబంధనలు పాటించని స్కూళ్లకు త్వరలో షోకాజ్ నోటీసులు
ఫ జిల్లావ్యాప్తంగా 156 పాఠశాలలు


