భువనగిరి టౌన్ : తమ సమస్యలు, దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు (సోమవారం నుంచి బుధవారం వరకు) మూడు రోజుల పాటు ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. దీనికి తోడు ఈ నెల 26వ తేదీ నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఈ సమ్మె ప్రభావంతో బ్యాంకింగ్ లావాదేవీలు, క్లియరింగ్ కార్యకలాపాలు, కౌంటర్ సేవలు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా మూడు పనిదినాలు బ్యాంకులు మూతపడనుండడంతో వ్యాపారులు, ఉద్యోగులు, సాధారణ ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. సమ్మె ప్రారంభానికి ముందు రోజైన ఈ నెల 27నబ్యాంకులు పనిచేసేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశాయి. ఆ రోజున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు శాఖలు పూర్తిస్థాయిలో సేవలందించనున్నాయి. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలన్నీ సమ్మె రోజుల్లో పనిచేస్తాయని లీడ్ బ్యాంక్ మేనేజర్ వీరన్న తెలిపారు.
నేడు బ్యాంకులు పనిచేస్తాయి
బ్యాంకు ఉద్యోగులు ఈనెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీన బ్యాంకులు యథావిధిగా పనిచేసేలా కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు తీసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. సమ్మె రోజుల్లో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, అందుబాటులో ఉన్న నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం వంటి డిజిటల్ సేవలనే ఎక్కువగా ఉపయోగించుకోవాలని కోరారు.
రేపటి నుంచి మూడు రోజులు విధుల బహిష్కరణ
ఫ నేడు బ్యాంకుల పనిదినం
ఫ ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఆదేశాలతో సేవలు


