భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ కళ ఎంతో అద్భుతంగా ఉందని బిహార్ రాష్ట్రానికి చెందిన ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం కొనియాడింది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో భారత్ దర్శన్‌లో శిక్షణపొందుతున్న 120 మంది బీహార్ ఇనిస్ట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్‌మెంట్ ట్రైనీ అఽధికారుల బృందం ఎక్స్‌ప్లోరర్ విజిట్‌లో భాగంగా శనివారం పోచంపల్లిని సందర్శించారు. మగ్గాలపై తయారయ్యే వస్త్రోత్పత్తులు, మార్కెటింగ్, కార్మికులకు లభిస్తున్న గిట్టుబాటు ధర, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. వారి వెంట ఎంసీఆర్‌డీ ప్రతినిధి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఆర్‌ఐ సత్యనారాయణరెడ్డి, ఏపీఓ కృష్ణమూర్తి తదితరులున్నారు.
పోచంపల్లిలో మాస్టర్ ప్రింటర్స్ బృందం
భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్‌లో తెలంగాణ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ జాతీయ సమావేశానికి హాజరైన జమ్మూకశ్మీర్, కేరళ, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, కలకత్తా, ఓడిషా, ముంబాయి, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన 50 మంది బృందం శనివారం పోచంపల్లిని సందర్శించింది. ఈ సందర్భంగా ఇక్కత్ వస్త్రాల తయారీని పరిశీలించారు. అదేవిధంగా ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఇద్దరు పర్యాటకులు టూరిజం పార్కు, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను సందర్శించి, ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.


