కష్టానికి ప్రతిఫలం
మాది రెక్కాడితే గానీ డొక్కాడని పేదరికం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నాం. మాకు ఉన్నది ఒక్కతే కూతురు సునీత. ఆమె భవిష్యత్తు ఏమవుతుందో అని నేను పడిన కష్టం, ఆరాటం ఊరికే పోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా కుమార్తె చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే క్రమశిక్షణతో చదువుకుంది. నా శ్రమను అర్థం చేసుకున్న మా కూతురు, కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. నన్ను తన దగ్గరే ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకుంటుంది.
– కలుకూరి సోమలక్ష్మి, లక్ష్మాపురం, రామన్నపేట
మాది తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామం. నేను హెడ్ మాస్టర్‌గా చేస్తున్నాను. నా సతీమణి భారతి. మాకు ముగ్గురు ఆడపిల్లలు. ఆ రోజుల్లో పల్లెటూర్లలో ఆడపిల్లలకు చదువెందుకని అని అందరూ వెనక్కి లాగినా, చదువే నా పిల్లలకు నేను ఇచ్చే అసలైన ఆస్తి అని నమ్మాము. 33 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన నేనే.. మా ఇంట్లోని ముగ్గురు పిల్లలకు గురువై నిలిచా. పిల్లలను ఏపీ రెసిడెన్షియల్, నవోదయ పరీక్షలకు సిద్ధం చేసి, వారి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లో ఇల్లు కట్టించి, మా సంపాదన అంతా వారి భవిష్యత్తుకే పెట్టుబడిగా పెట్టాము. ఆ కృషికి ప్రతిఫలంగా నేడు మా పెద్ద కూతురు అరుంధతి వైద్యురాలిగా, రెండో కూతురు శైలజ యూఎస్‌ఏలో స్కూల్ డైరెక్టర్‌గా, చిన్న కూతురు నీరజ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నత స్థానాల్లో నిలిచారు.
– నర్సింహా రెడ్డి, ఇబ్రహీంపూర్, తుర్కపల్లి
కూతురు మాకు
కొండంత బలం
అమ్మాయిలనే వివక్ష చూపలేదు
కోదాడ: మాది సాధారణ వ్యవసాయ కుటుంబమైనా ఆడపిల్లలనే వివక్ష చూపకుండా మా ఇద్దరు కుమార్తెలను అన్ని విధాలుగా ప్రోత్సహించి జీవితంలో ఉన్నతస్థాయికి చేరేలా చేశాం. పెద్ద కుమార్తె తేజస్విని ఇంజనీరింగ్, టీటీసి పూర్తి చేసి మొదట జైల్ వార్డెన్ ఉద్యోగం సాధించింది. తరువాత ఉపాధ్యాయురాలిగా ఎంపికై చింతలపాలెం మండలంలో పనిచేస్తోంది. ఇక చిన్న కుమార్తె ప్రియాంక.. ఇంజనీరింగ్ పూర్తి చేసి రెండు సంవత్సరాల క్రితం సివిల్ ఎస్‌ఐగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకొని ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తోంది. వారు కష్టపడి అనుకున్నది సాధించడం గర్వంగా ఉంది. – పందిరి లక్ష్మి– అమృతరెడ్డి,
జెర్రిపోతులగూడెం, చిలుకూరు మండలం
ఒకప్పుడు ఆడపిల్ల అంటే సానుభూతి చూపిన సమాజం ముక్కున వేలేసుకునేలా అమ్మాయిలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. తల్లిదండ్రులు
కష్టాన్ని నమ్ముకుంటే.. ఆ కన్నవారి నమ్మకాన్ని, శ్రమను ఆస్తులుగా మార్చుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. పేదరికాన్ని జయించి, వివక్షను దాటి, చదువే అసలైన ఆస్తిగా భావించి తమ కుమార్తెలను డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులు, ప్రొఫెసర్లుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల తీపి జ్ఞాపకాలను ‘డాటర్స్ డే’ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు.
ఆమే.. మా సంతోషం
మా అమ్మాయి గట్టు శ్రీజ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. చైన్నెలో ఇంజనీరింగ్ పూర్తిచేసి గోల్డ్ మెడల్ సాధించి మాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. మా కూతురు ఈరోజు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ మేము గర్వించేలా చేసింది. మా అమ్మాయికి డాటర్స్ డే శుభాకాంక్షలు.
– గట్టు వెంకటేశ్వర్లు –గీత, మిర్యాలగూడ
మా అమ్మాయిలు మాకు ఎంతో గర్వకారణం
మా అమ్మాయిలు మాకు ఎంతోగర్వకారణం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. మాకు అబ్బాయిలు లేరని ఏనాడూ బాధ పడలేదు. ఆస్తుల కంటే వారికి చదువు ముఖ్యమని చదివించాం. ఇప్పుడు వారు యూఎస్‌లో ఎంఎస్ చేసి జాబ్ చేస్తున్నారు. తల్లితండ్రులుగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. కూతురు పుట్టడం ఇంట్లో దీపం వెలగడం కాదు.. ఆ ఇల్లే వెలుగైపోవడం. ఆమె నవ్వు, మాట, మనసు వెలుగు. మా కూతుర్లు ప్రయోజకులు అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. – సత్యనారాయణ, సుధా, కోదాడ
అయ్యో.. నలుగురూ ఆడపిల్లలేనా అని నాడు చుట్టుపక్కల వారు సానుభూతి చూపిస్తే, మా నలుగురు పిల్లలే నా ఆస్తి అని చెప్పుకున్నాం. వృత్తిరీత్యా నేను ఆర్‌ఎంపీ అయినా మా భార్య లక్ష్మితో కలసి తాము శక్తికి మించి కష్టపడ్డాము. విద్యనే పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తిగా భావించి మా నలుగురు కుమార్తెలనూ ఉన్నత చదువులు చదివించాం. ఆ కష్టానికి ప్రతిఫలంగా నేడు పెద్ద కుమార్తె ఎంటెక్ పూర్తి చేసి ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తోంది. రెండో కుమార్తె ఎం ఫార్మసీ పూర్తి చేసి ఫార్మసీ కళాశాలలో ఫ్యాకల్టీగా చేస్తోంది. మూడో కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, చిన్న కుమార్తె బీఎస్సీ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతోంది. – పొడిశెట్టి వెంకన్న– లక్ష్మి, గుండాల
నలుగురు ఆడపిల్లలే నా ఆస్తి


