సూర్యాపేటటౌన్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చీటీలు, అధిక వడ్డీల ఆశ చూపి సుమారు రూ.7 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడు. ఈమేరకు బాధితులు శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండా పరిధిలోని ఏనెగంటి తండాకు చెందిన బానోత్ రాజు ఆత్మకూర్(ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో నివాసముంటున్నాడు. సుమారు పదేళ్లుగా చీటీలు నిర్వహించేవాడు. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించడంతో పాటు సూర్యాపేట, ఇతర ప్రాంతాల్లోని దుకాణాలకు డైలీ కలెక్షన్ ఫైనాన్స్ ఇస్తూ పలువురి వద్ద భారీగా సొమ్ము వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు.
లోన్లు ఇప్పించి మరీ టోకరా..
ఈయన చేతిలో మోసపోయిన వారిలో రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, కార్మికులతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు సైతం ఉన్నారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రాజు మధ్యవర్తిగా ఉండి బ్యాంకులో రూ.1.50 కోట్ల వ్యక్తిగత రుణం, మరో ఫైనాన్స్ కంపెనీలో రూ.60 లక్షల లోన్ ఇప్పించాడు. బ్యాంకు వడ్డీ కంటే తాను ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశచూపి ఆ ఉపాధ్యాయుడి నుంచి మొత్తం నగదును ఆయనే తీసుకున్నాడు. ఇదే తరహాలో మరికొందరికి లోన్లు ఇప్పించి వారి సొమ్మును కాజేసినట్లు బాధితులు వాపోతున్నారు.
ఇంటికి తాళం.. ఫోన్లు స్విచ్ఛాఫ్
ఇన్నాళ్లూ ఎలాంటి అనుమానం రాకుండా లావాదేవీలు నడిపిన రాజు.. అకస్మాత్తుగా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడు. ఆందోళనకు గురైన బాధితులు ఆయన ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. కుటుంబ సభ్యులు సైతం పది రోజులుగా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన చివ్వెంల, ఆత్మకూర్(ఎస్) మండలాలకు చెందిన బాధితులు ఎస్పీ నరసింహకు ఫిర్యాదు చేశారు. ఆరుగాలం శ్రమించి కూడబెట్టిన సొమ్ము పోవడంతో తమకు చావే శరణ్యమంటూ పలువురు కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాతే వసూళ్ల లెక్క తేలనుంది.
ఫ చీటీలు, అధిక వడ్డీ ఆశచూపి మోసం
ఫ బ్యాంకు లోన్లు ఇప్పించి సొమ్ము కాజేసిన ప్రభుత్వ ఉపాధ్యాయడు
ఫ బాధితుల్లో రైతులు, ఉపాధ్యాయులు, పోలీసులు, కార్మికులు
ఫ ఎస్పీని ఆశ్రయించిన బాధితులు


