భువనగిరి టౌన్ : రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించకుండా, క్షేత్రస్థాయి విచారణ చేపట్టకుండా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడిన గుండాల మండల తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్, ఇన్‌చార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) బి.శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎ.భాస్కర్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. గుండాల గ్రామం, మండల పరిధిలోని సర్వే నంబర్ 237 (విస్తీర్ణం 3.09 ఎకరాలు), సర్వే నంబర్ 238 (విస్తీర్ణం 5.36 ఎకరాలు) భూములకు సంబంధించి పాస్ పుస్తక డేటా సవరణ కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రాథమిక విచారణ ప్రకారం ఈ భూమికి సంబంధించి వారసుల మధ్య కుటుంబ వివాదాలు ఉన్నట్లు తేలింది. అయితే, ఆ వివాదాస్పద భూమి రికార్డులను నిశితంగా పరిశీలించకుండా, క్షేత్రస్థాయి విచారణ జరపకుండానే తప్పుడు విచారణ నివేదికలు, పంచనామాలను శ్రీనివాసరావు సిద్ధం చేశారు. అనంతరం భూ–భారతి పోర్టల్ ద్వారా ఉన్నతాధికారులకు తప్పుడు సిఫార్సులతో ఫైళ్లను పంపి, రికార్డులలో అక్రమంగా మార్పులు చేయడంతో పాటు తప్పుడు పాస్‌పుస్తకాలు జారీ అయ్యేలా చేశారు. ఈ వ్యవహారంపై భువనగిరి ఆర్డీఓ సమర్పించిన నివేదిక ఆధారంగా శ్రీనివాసరావును కలెక్టర్ సస్పెండ్ చేశారు.
మానసిక వికలాంగుల ఆశ్రమం తనిఖీ
వలిగొండ: రామన్నపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రత్నకుమారి శుక్రవారం వలిగొండ మండలంలోని టేకులసోమారంలో ఉన్న సాధన మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని సందర్శించారు. అదేవిధంగా వలిగొండ మండల కేంద్రంలోని శాంతి నిలయంను సందర్శించి, అక్కడ చదువుకుంటున్న అనాథ పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆశ్రమాల్లోని వసతులు, భోజనశాల, వంటగది, మరుగుదొడ్లు, ఆహార పదార్థాలు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. సాధన సెంటర్‌లో భోజనశాల వద్ద తగినంత వెలుతురు లేకపోవడం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన రావడం, వంటకు ఉపయోగించే నీటిని దుమ్ము, ధూళి పడేలా నీలిరంగు డ్రమ్ములో నిల్వ చేయడం వంటి లోపాలను గుర్తించారు. వికలాంగులకు, నాణ్య మైన ఆహారం అందించాలని ఆదేశించారు.
పెన్షన్ల పరిశీలనకు తీవ్ర ఆటంకం
భువనగిరిటౌన్ : దసరా పండుగ నాటికి లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన అర్హుల పరిశీలన ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందుల నడుమ కొనసాగుతోంది. అధికారిక యాప్‌లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. సర్వర్ మొరాయించడంతో జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు, ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేస్తుంటే.. ఒక్కో వివరానికి ఐదు నుంచి పది నిమిషాల సమయం తీసుకుంటోందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు ఈ నెల 30వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేయాల్సి ఉండడంతో గడువులోగా లక్ష్యాన్ని ఎలా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
దసరాలోపు నేతన్న భరోసా నిధులు
భూదాన్‌పోచంపల్లి : దసరా పండుగ లోపు నేతన్న భరోసా, త్రిఫ్ట్ డబ్బులను కార్మికుల ఖాతాలో జమ చేయుటకు ప్రభుత్వం హామి ఇచ్చిందని పోచంపల్లి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు తెలిపారు. శుక్రవారం ఆయన భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు భారత్ భూషణ్, ప్రధానకార్యదర్శి బొమ్మ హరిశంకర్, కోశాధికారి సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


