భువనగిరిటౌన్ : వినాయక నిమజ్జనోత్సవ శబ్దాలు ఆ దంపతుల ప్రాణాలను కాపాడాయి. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపిస్తున్న సమయంలో ఊరేగింపు సందడికి మేల్కొన్న దంపతులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన భువనగిరి పట్టణంలోని 33వ వార్డు విద్యానగర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితులు, అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వినాయక చౌరస్తా సమీపంలో గల విద్యానగర్‌కు చెందిన ఎండీ జలాల్ దంపతులు తమ ఇంట్లోని మొదటి అంతస్తులో నివాసముంటున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించాయి. అదే సమయంలో పట్టణ ప్రధాన రహదారి మీదుగా సాగుతున్న వినాయక నిమజ్జనం ఊరేగింపు శబ్దాలకు జలాల్ దంపతులు నిద్రలేచారు. అప్పటికే ఇల్లంతా పొగ, మంటలు వ్యాపించడాన్ని గమనించి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రూ. 6 లక్షల నగదు, ఫర్నీచర్, ధ్రువపత్రాలు కాలి బూడిదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ రమేష్ తెలిపారు.
ఫ గణేష్ నిమజ్జన ఊరేగింపు
సందడితో మేల్కొన్న దంపతులు
ఫ అప్రమత్తమై బయటకు పరుగులు
తీయడంతో తప్పిన ప్రాణాపాయం


