బిందు సేద్యం ద్వారా మొత్తం 13 రకాల పండ్ల తోటలను సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో మామిడి, దానిమ్మ, కొబ్బరి, జామ, సపోట, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, మునగ, బత్తాయి, జీడిమామిడి, అల్లనేరేడు, నిమ్మ తదితర రకాలు ఉన్నాయి.
ఆలేరు రూరల్: పండ్లు, కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. వాతావరణ మార్పులు, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గి పండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు ప్రతి జిల్లాలో పండ్ల తోటల సాగును తప్పనిసరి చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. వీబీజీ రాంజీ పథకం కింద జిల్లాలో ఈ ఏడాది 300 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు 135 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, 179 ఎకరాల్లో 29 వేల మొక్కలు నాటారు.
రాయితీలు, ఆర్థిక సాయం
రైతులు ఆసక్తి మేరకు మొక్కలను ఎంచుకుని నాటుకుంటే, కొనుగోలు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఉపాధి హామీ కూలీలతో ఉచితంగా గుంతలు తవ్విస్తారు. మొక్కల నిర్వహణ కోసం ఒక్కో మొక్కకు నెలకు రూ. 12 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఎరువుల కొనుగోలు కోసం మొక్కకు ఏడాదికి రూ. 50 చొప్పున చెల్లిస్తారు. ఈ సారి కొత్తగా బిందు సేద్యంపై ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీ చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం ఇతర సామాజిక వర్గాలకు పెద్ద రైతులకు 70 శాతం రాయితీపై పరికరాలు అందజేయనున్నారు. రైతులు పండ్ల తోటల మధ్య ఖాళీ స్థలంలో అంతర పంటలు వేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు.ఆసక్తి ఉన్న రైతులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు.
ఎల్‌నినో కారణంగా ఆశించిన మేర వర్షాలు కురవడం లేదు. దీంతో జిల్లాలో పండ్ల తోటల పెంపకాన్ని పోత్సహిస్తున్నాం. ఆసక్తి ఉన్న వారు పండ్ల తోటల సాగుకు ముందుకు రావాలి. అర్హులైన చిన్న, సన్నకారు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– నాగిరెడ్డి, డీఆర్‌డీఓ
ఫ ఈ ఏడాది లక్ష్యం 300 ఎకరాలు
ఫ ఇప్పటి వరకు 135 మంది దరఖాస్తు
ఫ వీబీజీ రాంజీ పథకం కింద ఉచితంగా మొక్కలు, గుంతల తవ్వకం పనులు
ఫ రాయితీపై బిందుసేద్యం పరికరాలు


