ఫ ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు
భువనగిరిటౌన్ : జిల్లాలో మాతృ మరణాల నివారణకు పకడ్బందీ ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావు వైద్యాధికారులను ఆదేశించారు. మాతృ మరణాలపై బుధవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌ఓ మనోహర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జిల్లాలో నమోదైన రెండు మాతృ మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడారు. గర్భిణుల వివరాలు, రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ నివేదికలను తప్పనిసరిగా మాతాశిశు సంరక్షణ కార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అధికారులు శ్రీనివాస్, సూర్యశ్రీరావు, సుమన్ కళ్యాణ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, వైద్య నిపుణులు డాక్టర్ ఆబిద్ అలీ, డాక్టర్ వీణ, డాక్టర్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి ఆలయంలో నిత్యపూజలను శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు బుధవారం నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని మేల్కొల్పిన అర్చకులు, ప్రధానాలయంలోని స్వయంభువులకు సుప్రభాత సేవ చేపట్టారు. బిందెతీర్థం, నిజాభిషేకం, ఆరాధన, అర్చనలు చేశారు. ప్రధానాలయం ముఖమండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన సేవలు నిర్వహించారు. ఇక ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహా హోమం, నిత్యకల్యాణం, గజవాహాన సేవలు జరిపించారు. ఇక సాయంత్రం జోడు సేవలను అర్చకులు ఊరేగించారు. రాత్రి స్వామి అమ్మవార్లకు శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు.
నాణ్యమైన విత్తనోత్పత్తితో అధిక దిగుబడులు
మోత్కూరు : నాణ్యమైన విత్తనోత్పత్తితోనే రైతులు మెరుగైన దిగుబడులు సాధించొచ్చని ఆత్మ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ దేవ్‌సింగ్ అన్నారు. వరిలో నాణ్యమైన విత్తనోత్పత్తి అంశంపై మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో బుధవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీలత, వి.శ్రీధర్, శివకుమార్ , ఆలేరు ఏడీఏ కె.నిర్మల, ఏఓ కీర్తి, పీఏసీఎస్ డైరెక్టర్ జె.లక్ష్మయ్య, సీఈవో వరలక్ష్మి, రైతులు, అధికారులు పాల్గొన్నారు.


