దేవరకొండ : మంటలంటుకొని వృద్ధ దంపతులు మృతిచెందారు. ఈ ఘటన దేవరకొండ పట్టణంలో బుధవారం జరిగింది. దేవరకొండలోని బీఎన్‌ఆర్ కాలనీకి చెందిన ఎండీ దాదుమియా(80), సఫియాబేగం(68) దంపతులకు తొమ్మిది మంది సంతానం. అందరికీ వివాహాలు అయ్యాయి. దాదుమియా దంపతులు గతంలో గాజులు అమ్మే వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం వారి చిన్న కుమారుడు అఫ్జల్ ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి దాదుమియా దంపతులు ఇంట్లోని తమ గదిలో నిద్రించగా.. బుధవారం తెల్లవారుజామున వారి గది నుంచి పొగలు వస్తుండటాన్ని చిన్న కోడలు చూసి భర్తను నిద్ర లేపింది. వెంటనే తలుపులు తెరిచి చూడగా అప్పటికే దాదుమియా దంపతులు కాలిన గాయాలతో మృతిచెంది ఉన్నారు. దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే గదిలో మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నాడు. మృతుల పెద్ద కుమారుడు మునీర్ ఫిర్యాదు మేరకు.. క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.


