ఆలేరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. బాలికల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నుంచి ఉచితంగా శానిటరీ ప్యాడ్ల సరఫరాకు శ్రీకారం చుట్టింది. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఏడాదికి సరిపడా ప్యాడ్లను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి సరఫరా అయిన ప్యాడ్లు ఇప్పటికే మండల వనరుల కేంద్రాలకు చేరగా, అక్కడ నుంచి పాఠశాలల వారీగా పంపిణీ చేస్తున్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అవసరం
యుక్తవయస్సులో బాలికలు రుతుస్రావం సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అవసరం. సరైన శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం ఉచితంగా ప్యాడ్లను అందిస్తుంది. ఒక్కో విద్యార్థినికి ప్రతి త్రైమాసికానికి 4 చొప్పున నాలుగు త్రైమాసికాలకు కలిపి 16 ప్యాడ్లను అందజేస్తున్నారు. విద్యార్థినుల సంఖ్య ఆధారంగా ప్యాడ్లను పాఠశాలల వారీగా కేటాయించారు. ఎమ్మార్పీకి సరఫరా అయినా ప్యాడ్లను ఆయా ప్రధానోపాధ్యాయులకు సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. పాఠశాలల్లో నీటి సదుపాయం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ప్యాడ్లను సురక్షితంగా పారవేసే ఏర్పాట్లు ఉంటే కార్యక్రమం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్యాడ్ల పంపిణీతో పాటు వాటి వినియోగం, పారవేతపై అవగాహన కల్పించి అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచితేనే కార్యక్రమం పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇస్తుందని ఉపాధ్యాయులు, పోషకులు పేర్కొంటున్నారు.
ఎమ్మార్సీల ద్వారా పంపిణీ
జిల్లాలో 17 ఎమ్మార్సీలు ఉండగా 35,571 శానిటరీ ప్యాడ్ల ప్యాకెట్లను మంజూరు చేసింది. ఒక్కో ప్యాకెట్‌లో 8 శానిటరీ ప్యాడ్లు ఉంటాయి. ఎంఈఓల ద్వారా ఆయా పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. ఎంపిక చేసిన మహిళా ఉపాధ్యాయురాలు, ఓ విద్యార్థిని బాధ్యత తీసుకొని శానిటరీ ప్యాడ్లను అవసరమైన బాలికలకు అందిస్తారు.
ఫ ఉచితంగా శానిటరీ ప్యాడ్ల పంపిణీ
ఫ ఇప్పటికే పాఠశాలలకు చేరిన ప్యాడ్లు
ఫ ఒక్కో విద్యార్థినికి ఏడాదికి 16చొప్పున అందించేలా ఏర్పాట్లు


