విద్యుత్‌ సామగ్రి కొనాలంటే ‘షాక్‌’ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సామగ్రి కొనాలంటే ‘షాక్‌’

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

సూర్యాపేట అర్బన్‌ : మార్కెట్‌లో విద్యుత్‌ సామగ్రి ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలతో పాటు రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. గృహ అవసరాలకు వాడే ఎలక్ట్రికల్‌ వస్తువులపై 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరగ్గా, వ్యవసాయానికి ఉపయోగించే కేబుల్‌ వైర్లు, స్టార్టర్లు, బుష్‌ల ధరలు ఏకంగా 40 శాతానికి పైగా పెరిగాయి. దీనికి తోడు కూలీల చార్జీలు కూడా తోడవడంతో కొత్తగా ఇల్లు నిర్మించుకునేవారు, బోరు మోటార్లు మరమ్మతు చేయించుకునే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొత్త ఇంటి నిర్మాణదారులకు కష్టం..

విద్యుత్‌ సామగ్రి ధరల మంట కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. గతంలో ఒక సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి పూర్తిస్థాయి ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ చేసేందుకు సుమారు రూ.45,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చయ్యేది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది రూ.65,000 నుంచి రూ.70,000 వరకు చేరుకుంది. అంటే ప్రతి ఇంటిపై సగటున రూ.20,000 మేర అదనపు భారం పడుతోంది. పైపులు, వైర్లు, స్విచ్‌ బోర్డులు, లేబర్‌ చార్జీలు అన్నీ కలసి బడ్జెట్‌ను దాటిపోతున్నాయి.

రైతన్నపై రెట్టింపు భారం

వ్యవసాయ రంగానికి అత్యవసరమైన మోటారు కేబుల్‌ వైర్లు, వైండింగ్‌ వైర్లు, స్టార్టర్లు, బుష్‌లు వంటి సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. పంట పొలాల్లో బోరు మోటారు ఏ చిన్న సమస్యకు గురైనా రిపేరు చేయించడం రైతులకు గగనంగా మారింది. వైండింగ్‌ చార్జీలతో పాటు విడిభాగాల ధరలు పెరగడంతో ప్రతి చిన్న మరమ్మతుకు వేలాది రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, సాగు ఖర్చులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఈ ధరల పెరుగుదల మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

40 శాతం వరకు పెరిగిన

విద్యుత్‌ పరికరాలు, కేబుల్‌ వైర్లు, స్టార్టర్ల ధరలు

సామాన్యులు, రైతులపై

అదనపు భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement