కట్టంగూర్ : మండలంలోని మునుకుంట్ల గ్రామ శివారులో చెరువు కట్టపై శనివారం రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, కట్టంగూర్ పోలీసులు దాడి చేసి 8మందిని పట్టుకున్నారు. మరో నలుగురు పరారైనట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.5,610 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చౌటుప్పల్ : మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో దండుమల్కాపురం గ్రామంలోని వైన్స్ సమీపంలో చెట్ల పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల మేరకు మృతుడు ఏపీలోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం కుమ్మమూరు గ్రామానికి చెందిన అన్నవరపు నాగరాజు(35)గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, వెల్డింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి భార్యాపిల్లలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటుండగా.. అతడు మాత్రం వెల్డింగ్ పని నిమిత్తం దండుమల్కాపురంలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. నాగరాజు ఎలా మృతిచెందాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.
డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా
● వృద్ధురాలికి గాయాలు
అడ్డగూడూరు : కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొని పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఈ ఘటన అడ్డగూడూరు మండలం చౌల్లరామరం గ్రామ స్టేజీ ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన డ్రైవర్ పొన్నం సందీప్ తన అమ్మమ్మ బండారి సోమక్కతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి వెళ్తుండగా.. అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామ స్టేజీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమక్క తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెకు ఆస్పత్రికి తరలించారు.
కారు ఢీకొని మహిళ మృతి
నాంపల్లి : కారు ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన నాంపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండ తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన పాటిమీదగూడేనికి చెందిన గుణబోయిన లక్ష్మమ్మను అదే గ్రామానికి చెందిన బోదాసు రాజు అనే వ్యక్తి గ్రామంలో కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం లక్ష్మమ్మను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె. లింగారెడ్డి తెలిపారు.


