ఎరలతో.. పంటల రక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎరలతో.. పంటల రక్షణ

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

గుర్రంపోడు : పంట దిగుబడి తగ్గడానికి తెగుళ్లు, చీడపీడలే ప్రధాన కారణం. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడుతుండటంతో పెట్టుబడి పెరగడమే కాకుండా, మిత్ర పురుగులు నశిస్తున్నాయి. దీనికితోడు ఆశించిన ఫలితాలు కూడా రావడం లేదు. ఈ క్రమంలో రైతులు ఖర్చు తగ్గించుకుని, మిత్ర పురుగులను కాపాడుకుంటూ పంటను రక్షించుకోవడానికి లింగాకర్షణ బుట్టలు, పసుపు రంగు అట్టలు (ఎల్లో స్టిక్కీ ట్రాప్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయని ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచిస్తున్నారు. వాటి వినియోగంపై రైతులకు పలు సూచనలు చేశారు.

లింగాకర్షణ బుట్టలు (ఫిరమోన్‌ ట్రాప్స్‌)

పంటలను ఆశించే పురుగులు.. ఒకదాని నుంచి మరో దానికి వచ్చే వాసనల ద్వారా ఆకర్షితమై వృద్ధి చెందుతాయి. వీటిని అరికట్టేందుకు లింగాకర్షణ బుట్టలు అమర్చాలి. ఇందులో ఉండే ఆడ పురుగు వాసనకు మగ పురుగులు ఆకర్షితమై బుట్టలో పడిపోతాయి. పురుగుల ఉధృతిని ప్రాథమికంగా గుర్తించేందుకు ఎకరాకు 4 బుట్టలు, వాటిని పూర్తిగా నివారించేందుకు ఎకరాకు 10 బుట్టలు అమర్చాలి. ప్రతి 25 నుంచి 30 రోజులకు ఒకసారి ఇందులో ఎరను (ల్యూర్‌) మార్చాలి. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు అన్ని రకాల కూరగాయల పంటలకు వీటిని ఉపయోగించవచ్చు. ఆయా పంటలను ఆశించే పురుగును బట్టి దానికి సంబంధించిన ఎరను బుట్టలో అమర్చుకోవాలి.

పసుపు రంగు అట్టలు (ఎల్లో స్టిక్కీ ట్రాప్స్‌)

రసం పీల్చే పురుగుల నివారణకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఆకుముడత, పచ్చదీపపు పురుగులను వీటితో అరికట్టవచ్చు. పురుగులు పసుపు రంగుకు ఆకర్షితమై అట్టలకు ఉన్న జిగురుకు అతుక్కుపోతాయి. పంట తొలిదశ నుంచే వీటిని వాడాలి. ఎకరాకు 10 చొప్పున తూర్పు, పడమర దిశల్లో వీటిని అమర్చాలి. అమర్చిన తర్వాత మొక్కలను కదల్చడం ద్వారా ఆకులపై ఉన్న తెల్లదోమ, ఇతర పురుగులు ఎగిరి అట్టలకు అంటుకుంటాయి. అట్టపై 50 శాతానికి మించి పురుగులు అతుక్కున్న తర్వాత పాతవి తీసేసి కొత్తవి అమర్చుకోవాలి. కూరగాయలు, పండ్లతోటల్లో కాయతొలుచు పురుగుల నివారణకు ఈ ఎరలు ఎంతో మేలు చేస్తాయి.

లింగాకర్షణ బుట్టల వినియోగంపై

ప్రాంతీయ ఉద్యానవన అధికారి

మురళి సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement