యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. స్వయంభూ పంచనారసింహులకు బిందే తీర్థం, ఆరాధన, బాలభోగం నిర్వహించి, నిజాభిషేకం జరిపించారు. సహస్రనామార్చన చేపట్టి, తులసీ దళాలతో అర్చించారు. అనంతరం గజ వాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు చేపట్టారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. ఇక.. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా శ్రీస్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 30నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 30వేలమందికి పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీనృసింహస్వామికి నిత్యాదాయం రూ.30,06, 857 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


