నార్కట్‌పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులకు కష్టాలు పెరిగాయని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, సాగునీరు సక్రమంగా అందకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం గ్రామంలో ఆదివారం ఆయన పలువురు రైతుల పొలాలను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణవెల్లెంల గ్రామ పరిధిలోని ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తిచేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రోజుకు 12 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో చెర్వుగట్టు ఆలయ మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, కొండూరు శంకర్, వెంకట్‌రెడ్డి, దశరథరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


