మిర్యాలగూడ : నూతన గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండలోని ఎస్‌బీఆర్ గార్డెన్‌లో ఆదివారం చాంబర్స్ జిల్లా కన్వీనర్ బెజ్జం సాయి అధ్యక్షతన జరిగిన సర్పంచుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన విధంగానే గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. స్థానిక సెస్‌లు, స్టాంపు డ్యూటీలు, సీనరేజ్, మైనింగ్ తదితర పన్నుల నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని 243 ఆర్టికల్, 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అధికారాలు, విధులు, నిధులను పంచాయతీలకు బదలాయించాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్స్ ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, రాష్ట్ర చాంబర్స్ కార్యదర్శి మందిపల్లి వెంకట్, బత్తుల వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
ఫ తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి


