నిబంధనలు కఠినతరం చేస్తాం
ఉదయం 10.40 గంటలకు కలెక్టరేట్ గేటుకు తాళం
సాక్షి, యాదాద్రి : భువనగిరి కలెక్టరేట్ ఉద్యోగుల సమయపాలనపై జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మీ ప్రమాణం లొకేషన్ ఆధారిత హాజరు విధానం తీసుకొచ్చినా కొందరు ఉద్యోగులు 10.30 గంటలకు కార్యాలయానికి రావాల్సిన ఉన్నా ఆలస్యంగా వస్తున్నారు. దీన్ని నివారించడానికి శుక్రవారం ఉదయం 10:40 గంటలకు కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళం వేశారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వివిధ శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులు గేటుబయటే నిలబడాల్సి వచ్చింది. పది నిమిషాల తర్వాత గేట్ తీయడంతో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.
మీ ప్రమాణంలో 900 మందే నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఉద్యోగుల హాజరు విధానం మీ ప్రమాణంలోకి ఉద్యోగులు చేరడంలేదు. జిల్లా కలెక్టరేట్‌లోని విభాగాల్లో 1250 మంది వరకు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో సుమారు 900 మంది వరకు మీ ప్రమాణంలో నమోదయ్యారు. ఇందులో కేవలం 500లోపే ముఖ ఆధారిత హాజరు ఉదయం, సాయంత్రం వేస్తున్నారు. సకాలంలో రాని ఉద్యోగులపై ప్రజావాణిలో పలు రకాల ఫిర్యాదులు అందాయి.
ఇక.. హాజరు ఆధారంగానే జీతం
మీ ప్రమాణం హాజరు అధారంగానే జీతం చెల్లించాలని ఆయా శాఖల హెచ్‌ఓడీలకు, జిల్లా ట్రెజరీ అఽధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు సర్క్యులర్ జారీచేశారు. దీంతో ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది. కాగా సాంకేతిక కారణాలు, ఆనారోగ్యం, డిప్యుటేషన్లతో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకు మీ ప్రమాణం హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.
సమయపాలన పాటించని ఉద్యోగులపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి. హెచ్‌ఓడీలు ఇచ్చే బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించేలా నిబంధనలు కఠినతరం చేస్తాం.
– భాస్కర్‌రావు, ఇన్‌చార్జి కలెక్టర్
ఫ ఆలస్యంగా వచ్చిన పలువురు ఉద్యోగులు గేటు బయటే..
ఫ పది నిమిషాల తర్వాత తాళం తీయడంతో లోపలికి..
ఫ ‘మీ ప్రమాణం’ హాజరు ఆధారంగా జీతం చెల్లించాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశాలు


