ఆంక్షలు ఉన్నప్పటికీ..
ఈడీ, సిట్ కేసులు ఉన్నా..
22ఏ నిషేధిత జాబితా సవరణపై అనుమానాలు
సాక్షి, యాదాద్రి : 22ఏ నిషేధిత జాబితాను సవరించిన అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో నిషేధిత జాబితాలో ఉన్న ఈడీ, సిట్ కేసుల భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివాదం శుక్రవారం తెరపైకి వచ్చింది. గత డిసెంబర్‌లో వ్యవసాయ భూములు, నివేశన స్థలాలను రిజిస్ట్రేషన్ యాక్ట్–1908 సెక్షన్ 22ఏలో చేర్చి రిజిష్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు, ప్రజలు, సొంతపార్టీ ఎమ్మెల్యే నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ప్రభుత్వం నిషేధిత జాబితాను ఈ వారంలోనే సవరించింది.
422 గ్రామ పంచాయతీల్లో..
జిల్లాలో 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 319 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 422 గ్రామ పంచాయతీల్లో నిషేధిత జాబితాల్లో 39,468 ఇళ్లు, 2450 సర్వే నంబర్లలో 28,549 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలను ఈడీ, సీఐడీ, సిట్, ఆర్‌ఆర్, ఏసీబీ కేసుల్లో ఉన్న భూములు 258 ఎకరాలు, ప్రభుత్వ స్థలాలు 964 ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చారు. వీటీతోపాటు అసైన్డ్ భూములు, భూదాన్, ఇనామ్, వక్ఫ్, దేవాదాయ శాఖ, చెరువులు, అటవీ, ప్రభుత్వ, భూములు, రోడ్లు, శ్మశానాలు వంటివి చేర్చారు.
చిక్కుల్లో తూప్రాన్‌పేట భూములు
నయీమ్ కేసుకు సంబంధించి ప్రత్యేక విచారణ కమిటీ (సిట్ )నుంచి క్లియరెన్స్ ఉన్నా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆంక్షల కారణంగా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం మళ్లీ చిక్కుల్లో పడింది.
ఆ ఐదెకరాల భూమి వివాదాస్పదం..
తూప్రాన్‌పేట పరిధిలోని సర్వే నంబర్లు 12, 13, 14లో ఉన్న సుమారు 45 ఎకరాల నాన్ అగ్రికల్చర్ (లేఅవుట్, ప్లాట్లు) భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయి. గతంలో నయీమ్ ముఠా బెదిరింపుల ద్వారా ఈ భూములను ఆక్రమించినట్లు కేసులు నమోదయ్యాయి. సీసీఎల్‌ఏ విచారణ తర్వాత సిట్ అధికారులు ఈ భూములకు క్లియరెన్స్ ఇస్తూ, నిషేధిత జాబితా నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. అయితే సిట్ క్లియరెన్స్ ఇచ్చి నిషేధిత జాబితా నుంచి తొలగించినప్పటికీ, ఈ 45 ఎకరాల భూమిలోనే 5 ఎకరాల భూమిపై ఈడీ ముందే ఆంక్షలు విధించినట్లు వెలుగు చూసింది. గతంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈడీ పంపిన జాబితా ఆధారంగా పాత ఐజీఆర్‌ఎస్ డేటాలో ఈ వివరాలు ఉన్నాయి.
సిట్ నిషేధిత జాబితా నుంచి తొలగించిందని కొందరు వ్యాపారులు రిజిస్ట్రేషన్లకు సిద్ధమయ్యారు. ఇందుకు చౌటుప్పల్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈడీ ఆంక్షలు స్పష్టంగా తేలకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు ఈ భూముల రిజిస్ట్రేషన్లను హోల్డ్‌లో పెట్టారని తెలుస్తోంది. అయితే నిషేధిత జాబితాలో ఉన్న వాటిని ఎలా రిజిస్ట్రేషన్‌కు అనుమతించారనే కోణంలో విచారణ ప్రారంభమైంది. రిజిష్ట్రేషన్లు జరిగాయని వాదన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమై విచారణ చేపట్టింది. చౌటుప్పల్ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌లను విచారిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి కొత్త రిజిస్ట్రేషన్లు జరగలేదని వారు తెలిపినట్లు సమాచారం.
ఫ తూప్రాన్‌పేటలో 45 ఎకరాల వివాదాస్పద భూములకు రెవెన్యూ క్లియరెన్స్!
ఫ అందులోని 5 ఎకరాలపై ముందు నుంచే ఉన్న ‘ఈడీ’ ఆంక్షలు
ఫ ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌తో విషయం వెలుగులోకి..
ఫ అధికారుల సహకారంపై విచారణ


